కేరళలోని శబరిమల అయ్యప్ప దేవస్థానం (Sabarimala Temple Opening) భక్తుల కోసం తెరుచుకోనుంది. మండల మకరవిళక్కు పండగ సీజన్ సందర్భంగా నవంబరు 16 నుంచి భక్తులను అనుమతించనున్నారు. రోజుకు 25వేల మంది భక్తులను మాత్రమే అనుమతించనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ గురువారం స్పష్టం చేశారు. పరిస్థితులను గమనించి భక్తుల సంఖ్య పెంపుపై నిర్ణయం తీసుకుంటామని సీఎం తెలిపారు.
కొవిడ్ నేపథ్యంలో గతేడాది ఏర్పాటు చేసిన వర్చువల్ క్యూ సిస్టమ్‌ను ఈ సంవత్సరం కూడా కొనసాగించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈసారి 10 ఏళ్లలోపు, 65 ఏళ్లు పైబడిన వారిని కూడా (Sabarimala Temple Opening) అనుమతించనున్నట్లు తెలిపింది. టీకా పొందినట్లు ధ్రువపత్రం చూపించినవారితో పాటు, కరోనా ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్టు ఉన్నవారికే దేవస్థానంలోకి ప్రవేశించేందుకు అనుమతి ఇస్తున్నారు.
నెయ్యాభిషేకం కార్యక్రమానికి కూడా అన్ని ఏర్పాట్లు చేసేందుకు ఆలయ బోర్డు నిశ్చయించింది. ఆ రోజు దర్శనం అనంతరం భక్తులు సన్నిధానంలో ఉండేందుకు అనుమతిని నిరాకరించింది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు హెల్త్ చెక్అప్ చేయించుకుని ఆలయానికి రావాలని సూచించింది.
రవాణాకు సంబంధించి గతేడాది నిబంధనలనే కొనసాగించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. వాహనాలను నీలక్కల్ వరకే అనుమతిస్తామని.. అక్కడి నుంచి ప్రభుత్వ బస్సులు అందుబాటులో ఉంటాయని పేర్కొంది.
ఇదీ చూడండి : లఖింపుర్ ఘటనలో కేంద్ర మంత్రి తనయుడికి సమన్లు