దిల్లీలోని ఓ హోటల్లో ఓ యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన కలకలం రేపింది. మంగళవారం సాయంత్రం అతడి మృతదేహాన్ని గుర్తించిన హోటల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్న పోలీసులు హోటల్ సిబ్బందిని విచారించారు. శవ పరీక్షల నిమిత్తం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఆస్పత్రికి తరలించారు.
అసలు ఏం జరిగిందంటే: దిల్లీ సాహిబాబాద్‌లోని ఓ హోటల్ సిబ్బందికి మంగళవారం ఓ యువకుడి మృతదేహం కనిపించింది. షాకయిన యాజమాన్యం ఈ సమాచారాన్ని పోలీసుకు తెలియజేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతుడి వివరాలను సేకరించారు. ప్రాథమిక విచారణలో ఇది ఆత్మహత్యగా పోలీసులు అనుమానిస్తున్నప్పటికీ మరింత సమాచారం శవ పరీక్ష నివేదిక వచ్చాకే తెలుస్తుందని అన్నారు. ఈ వ్యక్తిని దిల్లీకి చెందిన కైలాశ్గా పోలీసులు గుర్తించారు.
మంగళవారం ఓ మహిళను హోటల్‌కు వెంటబెట్టుకు వచ్చాడని.. కొద్దిసేపటికి వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని.. సాయంత్రానికి కైలాశ్ మృతదేహం గదిలో కనిపించిందని విచారణలో తేలింది. కైలాశ్‌తో పాటు వచ్చిన ఆ మహిళను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు పోలీసులు. ఇదే తరహా ఘటన మురాద్ నగర్లో సోమవారం జరిగింది. ఇక్కడ కూడా ఓ వ్యక్తి తన ప్రేయసిని హోటల్ రూమ్‌కు తీసుకుని వచ్చాడు. అయితే వారిద్దరి మధ్య జరిగిన వాగ్వాదంలో ఆ వ్యక్తి తన ప్రేయసి గొంతు నులుమి హత్య చేశాడు.
ఫిర్యాదు చేశారని గ్రామ బహిష్కరణ..
మహారాష్ట్ర ముంబయిలోని బోరివలి షింపోలీ గ్రామంలో ఓ కుటుంబాన్ని ఊరు నుంచి బహిష్కరించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులకు ఇచ్చిన ఓ ఫిర్యాదును ఆ కుటుంబసభ్యులు వెనక్కి తీసుకోనందున ఆ ఊరిలోని పెద్దలు ఈ తీర్మానాన్ని చేసినట్లు బాధితులు వాపోతున్నారు. అయితే ఇది చట్టవిరుద్ధమని.. తీర్మానం ఇచ్చిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
పోలీసుల కథనం ప్రకారం.. షింపోలి గ్రామానికి చెందిన ఓ మహిళ అదే గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులపై వేధింపులతో పాటు ఇతర ఆరోపణల విషయమై ఏప్రిల్ 16న పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఏప్రిల్ 22న ఊరి పెద్దలందరూ కలసి ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఫిర్యాదు ఉపసంహరించుకోవాలని బాధితురాలి కుటంబసభ్యులపై ఒత్తిడి తెచ్చారు. వారు ఎట్టి పరిస్థితిలో కేసు వాపసు తీసుకునేది లేదని తేల్చి చెప్పారు.
ఆగ్రహించిన గ్రామ పెద్దలు మే నెలలో వారిని బహిష్కరించేందుకు ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఏకగ్రీవంగా తీర్మానించుకున్నారు. ఈ విషయాన్ని కుటుంబానికి ఓ లేఖ ద్వారా తెలియజేశారు. అప్పటి నుంచి ఊరిలో ఎటువంటి ఉత్సవాలు జరిగినా వారిని రానిచ్చేవారు కాదు. ఇలా అన్నింటిలోనూ వారిని దూరం పెట్టడాన్ని చట్ట విరుద్దమని భావించిన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.
క్యాబ్ ఎక్కిన యువతిపై సాముహిక అత్యాచారం..
ఇంటికి వెళ్లేందుకు క్యాబ్ ఎక్కిన ఓ యువతిపై ఆ క్యాబ్ డ్రైవర్ దారుణానికి ఒడిగట్టాడు. తనతో పాటు మరో ఇద్దరు వ్యక్తులును వెంటబెట్టుకొచ్చి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని నొయిడాలో వెలుగు చూసింది. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు.
నొయిడా నుంచి ఔరాయియాలోని తన ఇంటికి వెళ్లడం కోసం ఓ యువతి బుధవారం రాత్రి సుమారు 8:30 సమయంలో ఓ షేర్ క్యాబ్ ఎక్కింది. క్యాబ్‌లోని ఇతర ప్యాసింజర్లను దింపిన ట్యాక్సీ డ్రైవర్ ఇక ఆ యువతి ఒంటరిగా ఉంటుందని నిర్ధరించుకుని తన స్నేహితులతో పాటు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమె తప్పించుకుంటుందని భావించి ఇత్మద్పుర్ వద్ద ఫిరోజాబాద్‌కు వెళ్లే మరో ఆటోలో ఎక్కించారు. వారి చెర నుంచి ఎలాగోలా తప్పించుకున్న యువతి పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు యువతి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు.