భారత్‌లో మరణించిన తన సోదరుడిని చివరిసారిగా చూసేందుకు బంగ్లాదేశ్‌లో ఉంటున్న ఓ సోదరి చేసిన ప్రయత్నం నెరవేరింది. ఇందుకోసం భారత్-బంగ్లాదేశ్ బీఎస్‌ఎఫ్ దళాలు ఆమెకు సహకరించాయి. దీంతో ఇరు దేశాల అధికారులపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదీ జరిగింది..
సబర్‌ఖాన్ అనే ఓ యువతి బంగ్లాదేశ్‌లో నివసిస్తోంది. అయితే భారత్‌లో నివసిస్తున్న తన సోదరుడు మరణించాడనే విషయం ఆమెకు తెలిసింది. కానీ, భారత్-బంగ్లాదేశ్ రెండు వేర్వేరు దేశాలు వేరు కావడం వల్ల పలు భద్రతా కారణాలతో అనేక ప్రక్రియలు దాటాలి. దీంతో సోదరుడిని చివరిసారిగా చూసేందుకు వీలు లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో సబర్ఖాన్కు.. భారత్ - బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతంలో ఉండే అమినుద్దీన్ అనే ఓ మంచి మిత్రుడు దొరికాడు. అతడి సహకారంతో బీఎస్‌ఎఫ్ సౌత్ బంగాల్ ఫ్రాంటియర్ ప్రతినిధి ఏకే ఆర్యని కలిశారు.
తన సోదరుడిని చివరిసారిగా చూసి నివాళులర్పిస్తానంటూ అధికారుల్ని వేడుకుంది సబర్‌ఖాన్. సోదరి బాధను అర్థం చేసుకున్న అధికారి అమీనుద్దీన్.. సొదరుడిని చూపించేందుకు చొరవ తీసుకొని బోర్డర్ అవుట్ పోస్ట్ మధుపూర్, 68 బెటాలియన్‌లోని బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ (బీజీబీ) కంపెనీ కమాండర్‌ను సంప్రదించి పరిస్థితిని వివరించారు. ఇందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశారు బీఎస్‌ఎఫ్ అధికారులు. దీంతో అంతర్జాతీయ సరిహద్దు దగ్గర సబర్‌ఖాన్ తన సోదరుడి మృతదేహానికి కన్నీటి వీడ్కోలు పలికింది. ఆమె కుటుంబ సభ్యులు కూడా నివాళులర్పించారు. తమకు సహాకరించిన బీఎస్‌ఎఫ్ అధికారులకు ఆమె కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
"మానవీయ విలువలను పరిరక్షించేందుకు బీఎస్‌ఎఫ్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది. దీంతో పాటు సామాజిక విలువలకు అవసరమయ్యే పరిస్థితుల్లో ప్రాధాన్యత ఇస్తుంది. దురుద్దేశాలు కలిగిన వారికి వ్యతిరేకంగా నిలుస్తుంది. సరిహద్దు ప్రాంతాల నివాసితుల భద్రతతో పాటు దేశ భద్రతను కాపాడేందుకు బీఎస్‌ఎఫ్ దళాలు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాయి."
- ఏకే ఆర్య, సౌత్ బంగాల్ ఫ్రాంటియర్ ప్రతినిధి
మంచులో 14 కి.మీలు గర్భిణీని మోసిన జవాన్లు..
జమ్ముకశ్మీర్‌లో ఆర్మీ జవాన్లు గొప్ప మనసును చాటుకున్నారు. పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణీని 14 కిలోమీటర్లు మోసుకుంటూ ఆసుపత్రికి తరలించారు. ఖారీ ప్రాంతంలోని హర్గం అనే గ్రామంలోని ఓ కుటుంబం, ఆ గ్రామ సర్పంచ్ నుంచి ఆర్మీ సిబ్బందికి మెడికల్ ఎమర్జెన్సీ కాల్ వచ్చింది. ఓ గర్భిణీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని సమాచారం అందుకున్నారు. ఈ క్రమంలో రోడ్లన్నీ మంచుతో నిండి ఉన్నాయి. అయినా మంచును లేక్కచేయలేదు జవాన్లు. దాదాపు 6 అడుగుల లోతు ఉన్న మంచులో 6 గంటలు శ్రమించి మహిళను స్ట్రెచర్‌పై ఉంచి 14 కిలోమీటర్లు వరకు మోసుకెళ్లారు. అంగారీ అనే గ్రామంలో మరో ఆర్మీ టీమ్ మహిళ కోసం అంబులెన్స్‌ను సిద్ధంగా ఉంచింది. దీంతో గర్భిణీని సురక్షితంగా బనిలాల్లో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లారు.