గుజరాత్ బోటాడ్ జిల్లాలో దారుణం జరిగింది. రోజిద్ గ్రామంలో కల్తీ మద్యం తాగి 8మంది మృతిచెందారు. మరో పదిమంది అస్వస్థతకు గురయ్యారు. వీరందరిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆరుగురు ధందుకలో మరణించగా.. ఇద్దరు బోటాడ్ ఆస్పత్రిలో మృతిచెందారని అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు.. హుటాహుటిన గ్రామానికి చేరుకున్నారు. అప్రమత్తమైన అధికార యంత్రాంగం భావ్‌నగర్ నుంచి ప్రత్యేక వైద్యుల బృందాన్ని గ్రామానికి పంపించింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం.. విచారణకు సిట్‌ను ఏర్పాటు చేసింది. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి విషమంగానే ఉందని అధికారులు తెలిపారు.
గుజరాత్ పోర్బందర్ పర్యటనలో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఈ ఘటనపై ఘాటుగా స్పందించారు. కల్తీ మద్యం వల్ల అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని అన్నారు. గుజరాత్ మద్యపాన నిషేధ రాష్ట్రమని.. అయినా లిక్కర్ ఎలా అమ్ముతున్నారని ప్రశ్నించారు. ఈ అక్రమ అమ్మకందారులు ఎవరో ప్రజలకు తెలుసన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: 'అధికారం కోసమే రాజకీయాలా?.. వదిలేయాలని అనిపిస్తోంది'
మోదీ సలహాతో డైట్ మార్చిన యువ నేత.. బరువు తగ్గేందుకు విశ్వ ప్రయత్నాలు!