ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో జరుగుతున్న కావడి యాత్రలో ఐదుగురు భక్తులు మృతి చెందారు. కన్వారీ యాత్రలో భాగంగా వెళ్తున్న ఓ డీజే ట్రక్.. 11వేల కేవీ విద్యుత్ తీగను తగలింది. దీంతో కరెంట్ షాక్‌కు గురై ఐదుగురు యాత్రికులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 16 మంది తీవ్రగాయాలపాలయ్యారు.
అసలేం జరిగిందంటే..
భవన్‌పుర్ ప్రాంతంలోని చిలౌర రాలి గ్రామంలో కావడి యాత్రికులతో కూడిన ఓ డీజే ట్రక్ బయలుదేరింది. మార్గమధ్యలో కిందకు వేలాడి ఉన్న 11వేల కేవీ లైన్‌ను ట్రక్ ఢీకొట్టింది. దీంతో వెంటనే వాహనమంతా కరెంట్ వ్యాపించింది. అందులోని యాత్రికులంతా షాక్‌కు గురయ్యారు. దీంతో ఐదు మంది అక్కడిక్కడే మృతి చెందారు. మరో 16 మంది తీవ్రగాయాలపాలయ్యారు. విషయం తెలుసుకుని అప్రమత్తమైన పోలీసులు.. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులు సైతం ఆ ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. మృతులతో పాటు గాయపడ్డవారిని అంబులెన్స్ సహాయంతో ఆసుపత్రికి తరలించారు. ఐదుగురి మృతదేహాలను శవ పరీక్షల కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అదే సమయంలో వారి బంధువులకు కూడా సమాచారం అందించారు.
మరోవైపు ఈ ఘటన వల్ల కోపోద్రిక్తులైన కావడి యాత్రికులు ఘటనాస్థలిలోనే రోడ్డుపైన బైఠాయించారు. దీంతో అక్కడే ఉన్న అధికారులు వారి వద్దకు చేరుకుని శాంతింపజేసే ప్రయత్నం చేశారు. గ్రామస్థులు సైతం ఈ విషయంపై ఆవేదన వ్యక్తం చేశారు. డీజే అమర్చిన ఆ ట్రక్‌లో దాదాపు 30 నుంచి 35 మంది ఉన్నారని తెలిపారు.
స్నానం చేస్తుండగా..
ఉత్తరాఖండ్ రుషికేశ్‌లోని ఉన్న త్రివేణి ఘాట్ వద్ద ఓ భక్తుడు త్రుటిలో ఓ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. బాందా ప్రాంతానికి చెందిన లవ్లేశ్ అనే కావడి యాత్రికుడు త్రివేణి ఘాట్ గంగానదిలో స్నానం చేస్తున్న సమయంలో నీటి ఉద్ధృతి పెరగడం వల్ల కొట్టుకుపోయాడు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత.. గంగానది మధ్యలోనే చిక్కుకుపోయాడు. అయితే కాపాడమని అతడు గట్టిగా అరిచాడు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు అప్రమత్తమై.. యువకుడి ప్రాణాలను కాపాడారు. బాధితుడ్ని నదిలో నుంచి సురక్షితంగా బయటకు తెచ్చారు.