Houses Set On Fire: బంగాల్లో మరోసారి హింస చెలరేగింది. బీర్భుమ్ జిల్లా రాంపుర్హట్ ప్రాంతంలో మంగళవారం.. కొందరు దుండగులు ఇళ్లకు నిప్పుపెట్టగా 8 మంది సజీవదహనమయ్యారు. ఇందులో ఇద్దరు చిన్నారులున్నారు. మరో ఇద్దరు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి.. మంటలను ఆర్పివేసినట్లు వివరించారు.
తృణమూల్ కాంగ్రెస్ నేత, బర్షాల్ గ్రామ పంచాయతీ డిప్యూటీ చీఫ్ బహదూర్ షేక్‌ను సోమవారం ఎవరో హత్యచేశారు. దీంతో రెచ్చిపోయిన ఆయన అనుచరులు.. రాంపుర్హట్లోని 5 ఇళ్లకు నిప్పుపెట్టారు. 8 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
''ఈరోజు ఉదయం ఒకే ఇంటి నుంచి ఏడు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాం. అంతకుముందు 10 మంది చనిపోయారని వార్తలొచ్చాయి. అది నిజం కాదు. మొత్తం 8 మంది చనిపోయారు.''
- మనోజ్ మాలవీయ, బంగాల్ డీజీపీ
ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందని తెలిపిన ఆయన.. ఇప్పటివరకు ఘటనకు సంబంధించి 11 మందిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్, సర్కిల్ ఇన్స్పెక్టర్లను తొలగించినట్లు పేర్కొన్నారు. ఘటనపై విచారణకు ప్రత్యేక బృందాన్ని నియమించినట్లు స్పష్టం చేశారు.
నివేదిక కోరిన కేంద్ర ప్రభుత్వం..
బంగాల్ ఘటనపై వీలైనంత త్వరగా పూర్తి నివేదిక అందించాలని కేంద్ర హోంశాఖ.. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఉదంతంపై తగిన చర్యలు తీసుకోవాలని 9 మంది భాజపా ఎంపీల బృందం కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిసిన అనంతరం.. ఈ ప్రకటన వెలువడింది.
ఘటన స్థలానికి సీఐడీ బృందం..
బీర్భుమ్ ఘటనపై సీఐడీ బృందం దర్యాప్తు చేస్తోంది. ఇళ్లు కాలిపోయిన ప్రాంతానికి వెళ్లి అధికారులు పరిశీలించారు.
గవర్నర్ వ్యాఖ్యలపై సీఎం..
ఈ ఘటనపై బంగాల్ గవర్నర్ జగ్దీప్ ధన్కర్ స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం హింసను ప్రేరేపిస్తుందని, ఇది అత్యంత దారుణమైన ఘటన అని ఆరోపించారు. ఈ వాఖ్యలను ఖండించిన సీఎం మమతా బెనర్జీ.. రాజ్యాంగపరంగా గౌరవప్రదమైన పదవిలో ఉండి ఇలా అనాలోచితంగా మాట్లాడటం మానుకోవాలని గవర్నర్‌కు లేఖ రాశారు.
విచారణకు నడ్డా కమిటీ..
బంగాల్ ఘటనపై విచారణ జరిపేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు భాజపా అధ్యక్షుడు నడ్డా. ఇందులో నలుగురు ఎంపీలు ఉన్నారు. వీరంతా ఘటనా స్థలాన్ని పరిశీలిస్తారని ఆయన పేర్కొన్నారు. నిందితులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: క్షీణించిన లాలూ ఆరోగ్యం.. రాంచీ నుంచి దిల్లీకి తరలింపు!