WHO Covid Deaths India: భారత్‌లో కొవిడ్ మరణాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన నివేదికను దేశంలోని 20 రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు తప్పుపట్టారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన చింతన్ శివిర్ సమావేశంలో పాల్గొన్న ఆరోగ్య మంత్రులు.. డబ్య్యూహెచ్ఓ నివేదికపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సమావేశానికి కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ అధ్యక్షత వహించగా.. 20 రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు, ఇతర రాష్ట్రాల ప్రతినిధులు హాజరయ్యారు. గురువారం ప్రారంభమైన ఈ సమావేశం మూడు రోజుల పాటు కొనసాగనుంది. ఈ అంశంపై స్పందించిన దిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్.. తాము పూర్తి పారదర్శకతతో మరణాలను లెక్కించామన్నారు. ఇతర రాష్ట్రాల డేటాపై కామెంట్ చేయనని.. కానీ దిల్లీలో మాత్రం ప్రతి ఒక్క మరణాన్ని నమోదు చేశామని తెలిపారు.
మరోవైపు డబ్యూహెచ్ఓ నివేదికపై రాజకీయ దుమారం కొనసాగుతూనే ఉంది. కొవిడ్ మరణాలపై ప్రధాని నరేంద్ర మోదీ తప్పుడు లెక్కలు సమర్పించాడని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. దీనిపై స్పందించిన భాజపా రాహుల్ విమర్శలు గట్టిగా తిప్పికొట్టింది. డబ్ల్యూహెచ్‌ఓ డేటా.. కాంగ్రెస్ బేటా రెండూ తప్పేనంటూ విమర్శించింది.
BJP On Rahul Gandhi Comments: కొవిడ్ మహమ్మారిపై ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్.. పోరాడినా తీరు ప్రపంచ దేశాలకు ఉదాహరణగా నిలిచిందన్నారు భాజపా అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా. కరోనా లెక్కలపై రాజకీయాలు చేయడం చాలా బాధాకరమన్నారు. అనేక అభివృద్ధి చెందిన దేశాల కంటే భారతదేశం కరోనాను సమర్థంగా ఎదుర్కొందని స్పష్టం చేశారు. భాజపా పాలిత, ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలని తేడా లేకుండా భారత్ ఒక్కటిగా పోరాడిందని తెలిపారు. డబ్ల్యూహెచ్‌ఓ డేటా.. కాంగ్రెస్ బేటా రెండూ తప్పేనంటూ విమర్శించింది. భారత్‌లో కొవిడ్ మరణాలను అంచనా వేసేందుకు డబ్ల్యూహెచ్‌ఓ ఉపయోగించిన మెథడాలజీలో లోపాలు ఉన్నాయని భాజపా అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా పేర్కొన్నారు. దీనిపై కేంద్ర అభ్యంతరాలను సైతం ప్రపంచ ఆరోగ్యసంస్థకు తెలియజేసినట్లు తెలిపారు. 2014 నుంచి ప్రధాని మోదీ ప్రతిష్ఠను దిగజార్చేందుకు రాహుల్ గాంధీ ప్రయత్నిస్తూనే ఉన్నారని విమర్శించారు. జనన, మరణాల నమోదులో కేంద్రం నిర్ధిష్ట విధానాన్ని అనుసరిస్తోందని స్పష్టం చేశారు.
Rahul Gandhi On WHO Covid Deaths: భారత్‌లో కరోనా మరణాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన నివేదికపై.. మోదీ సర్కారు లక్ష్యంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ విమర్శలు గుప్పించారు. సైన్స్ అబద్ధం చెప్పదని ప్రధాని నరేంద్రమోదీ చెబుతారని మండిపడ్డారు. కరోనా కారణంగా మరణించిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉండాలన్న రాహుల్‌గాంధీ.. వారి కుటుంబాలకు ఇవ్వాల్సిన 4 లక్షల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కొవిడ్ మహమ్మారి కారణంగా 47 లక్షల మంది భారతీయులు మరణించారని.. ప్రభుత్వం చెప్పినట్లు 4.8 లక్షలమంది కాదని రాహుల్ ట్వీట్ చేశారు. కొవిడ్ మహమ్మారి సమయంలో కోట్లాది మంది ప్రజలు ఆక్సిజన్, మందులు, ఆసుపత్రి పడకల కోసం బాధపడుతుండగా.. ప్రభుత్వం మాత్రం గారడీ గణాంకాలపై దృష్టి సారించిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఆరోపించారు. నిజనిజాలు ఏంటో దేశ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు.
ఇదీ చదవండి: 'విదేశీ వస్తువుల బానిసత్వం నుంచి బయటపడాలి'