ఒడిశా పర్యటనలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు ఊహించని అనుభవం ఎదురైంది. ముర్ము సొంత జిల్లా మయూర్‌భంజ్‌లో జరుగుతున్న ఓ సభలో ఆమె మాట్లాడుతుండగా.. విద్యుత్ అంతరాయం ఏర్పడింది. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఒడిశా వచ్చిన రాష్ట్రపతి ముర్ము.. మయూర్‌భంజ్‌లో మహారాజ శ్రీరామచంద్ర భంజ్‌దేవ్ విశ్వవిద్యాలయంలో జరిగిన స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఆమె ప్రసంగిస్తుండగా కరెంట్ కట్ అయ్యింది. దీంతో చీకట్లోనే ప్రసంగాన్ని కొనసాగించారు.
దీనిపై స్పందించిన పౌరసంబంధాల శాఖ అధికారులు విచారం వ్యక్తం చేశారు. ఆడిటోరియంకు విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని.. లోపల వైరింగ్‌లో తలెత్తిన లోపం వల్లే ఇలా జరిగిందని ఉత్తర ఒడిశా పవర్ డిస్ట్రిబ్యూటర్ లిమిటెడ్ సీఈఓ భాస్కర్ సర్కార్ తెలిపారు. ఉదయం 11:56 నుంచి 12:05 వరకు 9 నిమిషాలపాటు కరెంట్ కట్ అయిందని చెప్పారు.
"అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనకు క్షమాపణలు. రాష్ట్రపతి ప్రసంగిస్తుండగా జరిగిన విద్యుత్ అంతరాయనికి చింతిస్తున్నాం. IDCO ఈ భవనాన్ని నిర్మించి.. జనరేటర్‌ను సైతం మరమత్తు చేయించింది. ప్రత్యేకమైన జనరేటర్ ఉన్న సమయానికి అది పనిచేయలేదు. విశ్వవిద్యాలయానికి చెందిన ఎలక్ట్రిక్ అధికారిని సస్పెండ్ చేశాం. ఈ ఘటనపై దర్యాప్తునకు ఓ కమిటీని నియమిస్తాం. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటాం."
-సంతోశ్ కుమార్ త్రిపాఠి, వైస్ ఛాన్స్లర్
'మీ సంతోషమే కాదు దేశ సంక్షేమం కోసం ఆలోచించండి'
మయూర్‌భంజ్‌లో మహారాజ శ్రీరామచంద్ర భంజ్‌దేవ్ విశ్వవిద్యాలయంలో జరిగిన 12వ స్నాతకోత్సవంలో విద్యార్థులను ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగించారు. డిగ్రీ పట్టాలు పొందినంత మాత్రాన విద్య అనేది ముగిసిపోదని.. అది నిరంతర ప్రక్రియ అని చెప్పారు. 'ఉన్నత విద్యను అభ్యసించాక కొంతమంది ఉద్యోగం సాధిస్తారు. కొంత మంది వ్యాపారం, పరిశోధన చేస్తారు. కానీ ఉద్యోగం చేయడం కంటే ఇవ్వడం గొప్ప విషయం' అని అన్నారు. విశ్వవిద్యాలయంలో ఇంక్యూబేషన్ సెంటర్ ఏర్పాటుచేసి విద్యార్థులు, సాధారణ ప్రజలు స్టార్టప్‌లు రూపొందించేలా కృషి చేయడం అభినందనీయమన్నారు. దాతృత్వం, సహకారం ద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించవచ్చని తెలిపారు. విద్యార్థులు.. వారు పురోగమిస్తూనే అణగారిన వర్గాలకు సాయం అందించాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు తమ సంతోషాల గురించి మాత్రమే కాకుండా సమాజం, దేశం సంక్షేమం కోసం కూడా ఆలోచించాలని అభిప్రాయపడ్డారు. విద్యార్థులు ప్రతి పనిలో విజయం సాధించాలని.. ఆసాధ్యం అనుకున్న ప్రతి పనిని సుసాధ్యం చేసుకోవాలని ముర్ము ఉపదేశించారు.