PM CARES for Children Scheme: కొవిడ్ కారణంగా తల్లిందడ్రులు, సంరక్షకులను కోల్పోయిన చిన్నారులకు పీఎం కేర్స్ పథకం కింద సాయం అందజేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇది అనాథలైన పిల్లలకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. కొవిడ్ సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన వారి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో తనకు తెలుసునని.. వారి కోసమే ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు.
" కొందరికి ఉన్నత విద్య కోసం విద్యా రుణాలు అవసరమవుతాయి. దానికి సైతం పీఎం కేర్స్ సాయపడుతుంది. అలాంటి వారికి రోజువారీ ఖర్చుల కోసం ఇతర పథకాల ద్వారా నెలకు రూ.4వేలు అందిస్తున్నాం. ఒక ప్రధాని కాకుండా కుటుంబ సభ్యుడిగా పిల్లలతో మాట్లాడుతున్నా. ఈరోజు పిల్లల మధ్య ఉన్నందుకు చాలా రిలీఫ్‌గా ఉన్నా. దేశంలోని ప్రతిఒక్కరు వారితో ఉన్నారనే భరోసాను పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ కల్పిస్తోంది. అనాథలైన చిన్నారులు పాఠశాల విద్యను పూర్తి చేసుకున్న తర్వాత ఎక్కువ డబ్బు అవసరమవుతుంది. 18-23 ఏళ్ల వారికి ప్రతినెల స్టైఫండ్ అందుతుంది. వారు 23 ఏళ్ల వయసుకు చేరుకున్న తర్వాత రూ.10 లక్షలు వస్తాయి. పీఎం కేర్స్ ద్వారా ఆయుష్మాన్ హెల్త్ కార్డు అందిస్తాం. దాని ద్వారా రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం అందుతుంది."
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
2020 మార్చి 11 నుంచి 2022 ఫిబ్రవరి 28 మధ్యలో తల్లిదండ్రులు, చట్టబద్ధమైన సంరక్షకులు, దత్తత తల్లిదండ్రులు లేదా ఏకైక ఆధారంగా ఉన్న తల్లినో, తండ్రినో కోల్పోయిన పిల్లలకు ఉపకారవేతనాలు, పీఎం కేర్స్ పాస్ పుస్తకాలు, ఆయుష్మాన్ భారత్ వైద్య బీమా కార్డును అందించనున్నారు. ఈ పథకంలో భాగంగా.. పిల్లలకు 18 ఏళ్లు నిండేసరికి వారి పేరిట రూ.10 లక్షల సొమ్ము ఉండేలా డిపాజిట్ చేస్తారు. 18 నుంచి 23 ఏళ్ల వయసు వరకు ఆ డిపాజిట్‌పై వడ్డీని వారికి ఆర్థిక సాయంగా అందిస్తారు. 23 ఏళ్లు నిండిన తర్వాత పూర్తిగా రూ.10 లక్షలు లబ్ధిదారులకు ఇచ్చేస్తారు. అర్హులైన పిల్లలు తమ పేర్లు నమోదు చేసుకునేందుకు పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పేరుతో ఒక పోర్టల్ ప్రారంభించారు. పేర్ల నమోదు దగ్గర నుంచి దరఖాస్తుల ఆమోద ప్రక్రియ, సాయం అందించటం వరకు అన్నీ ఈ పోర్టల్ ద్వారా మాత్రమే సాగుతాయి.
ఇదీ చూడండి: 'కరోనా సంక్షోభంలోనూ రూ.కోట్ల సంపద.. యూనికార్న్ స్టార్టప్‌ల సెంచరీ'