NEET-PG 2021 counselling: నీట్- పీజీ 2021 కౌన్సెలింగ్‌లో జాప్యంపై రెసిడెంట్ డాక్టర్ల నిరసన నాటకీయ మలుపు తిరిగింది. వైద్యులు, పోలీసు సిబ్బంది ఒకరిపై ఒకరు బాహాబాహీకి దిగారు. ఈ ఘర్షణల్లో చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ నేతృత్వంలో చేపట్టిన నిరసన కార్యక్రమం గందరగోళంగా మారింది. మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజ్ నుంచి సుప్రీంకోర్టు వరకు నిరసన ప్రదర్శన నిర్వహించడానికి ప్రయత్నించగా.. పోలీసులు చాలా మందిని అదుపులోకి తీసుకున్నారు.
'మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజ్ నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్లి నిరసన తెలియజేయాలని ప్రయత్నించాం. కానీ మేము దానిని ప్రారంభించిన వెంటనే పోలీసులు మమ్మల్ని ముందుకు వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే మాపై దాడి చేశారు. ఈ ఘటనలో ఎంతోమంది గాయపడ్డారు. మాలో చాలా మందిని అరెస్ట్ చేశారు. ' అని రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మనోజ్ తెలిపారు.
రెసిడెంట్ డాక్టర్ల వ్యాఖ్యలను పోలీసులు ఖండించారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు ఎవరిపై కూడా పోలీసులు లాఠీచార్జ్ చేయలేదని స్పష్టం చేశారు. రెసిండెంట్ డాక్టర్లపై పోలీసులు దుర్భషలాడారన్న మనోజ్ ఆరోపణలను పోలీసులు ఖండించారు. ఈ నిరసనలో కేవలం 12 మందిని అదుపులోకి తీసుకుని వెంటనే విడుదల చేసినట్లు తెలిపారు.
ఈ ఘటనపై డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రోహిత్ మీనా స్పందించారు. రెసిండెంట్ డాక్టర్లు ఉద్దేశపూర్వకంగా ప్రధాన రహదారిపై ఆందోళన చేపట్టారని అన్నారు. నైట్ ఖర్ఫ్యూని దృష్టిలో ఉంచుకొని రోడ్డు నుంచి బయటకు వెళ్లాలని వారికి పోలీసులు సూచించినా.. దూకుడుగా వ్యవహరించినట్లు పేర్కొన్నారు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకుంటుంటే వారు దాడికి దిగినట్లు తెలిపారు. ఈ ఘటనలో ఏడుగురు పోలీసులను గాయపరచటంతో పాటు పోలీసు బస్సు అద్దాలను కూడా పగలగొట్టినట్లు ఆరోపించారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసినందుకుగానూ వారిపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. రెసిడెంట్ డాక్టర్లు డిమాండ్లను నెరవేర్చేందుకు ఆరోగ్య శాఖ అధికారులు హామీ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.
డాక్టర్లపై పోలీసుల వ్యవహరించిన తీరుకు నిరసనగా బుధవారం ఉదయం 8 గంటల నుంచి దేశవ్యాప్తంగా అన్ని ఆరోగ్య సేవలను బహిష్కరిస్తున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ తెలిపింది.
ఇదీ చూడండి: రెసిడెంట్ డాక్టర్ల ఆందోళనలో ఉద్రిక్తత- వైద్యులను నిర్బంధించి..