Matric exam 2022 date Odisha: చదువుకు వయసుతో సంబంధం లేదని నిరూపించారు 70 ఏళ్ల ఎమ్మెల్యే. ఈ వయసులోనూ పదో తరగతి బోర్డు పరీక్షలకు హాజరై.. మధ్యలోనే చదువు ఆపేసిన చాలా మందికి ఒక ప్రేరణగా నిలిచారు. ఆయనే.. ఒడిశాలోని కంధమాల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే అంగాడ కన్హార్.
జిల్లాలోని ఫుల్బాని నియోజకవర్గ ఎమ్మెల్యే అంగాడ కన్హార్(70).. 1978లోనే తన చదువు ఆపేశారు. ఆ తర్వాత రాజకీయాల్లో రాణించినా పదో తరగతి పూర్తి చేయాలని ఎప్పుడూ అనుకునే వారు. ఈ క్రమంలో బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(బీఎస్ఈ) నిర్వహిస్తోన్న హైస్కూల్ వార్షిక పరీక్షలకు శుక్రవారం హాజరయ్యారు. ఆయన హాజరైన పరీక్ష కేంద్రం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పదో తరగతి పరీక్షలకు హాజరై వార్తల్లో నిలిచారు ఎమ్మెల్యే.
శుక్రవారం ప్రారంభమైన బోర్డు పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 5.71 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 3,540 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించారు. వారితో పాటు 9378 మంది ఓపెన్ స్కూల్, 4443 మంది మాధ్యమ పరీక్షల రాశారు. మే 6 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి.
ఇదీ చూడండి: కొత్త ఇంటికి మోదీ పేరు పెట్టిన వీరాభిమాని