1991లో చేపట్టిన ఆర్థిక సంస్కరణల కారణంగా 30 లక్షల మంది పేదరికం నుంచి కోలుకున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యానించారు. ఆ సంస్కరణలవల్లే.. భారత్లోని పలు సంస్థలు ప్రపంచ శక్తిగా ఎదిగాయని అన్నారు. ఆర్థిక సంస్కరణలు చేపట్టి నేటికి 30 ఏళ్లయిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు సింగ్.
పీవీ నర్సింహరావు ప్రధానిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ఈ సంస్కరణలు చేపట్టారు. ఈ నేపథ్యంలో శుక్రవారం పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
"30 ఏళ్ల క్రితం ఈరోజు.. దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త దారిని చూపించింది కాంగ్రెస్ ప్రభుత్వం. గత 30 ఏళ్లుగా.. ప్రభుత్వాలు ఇదే బాటలో అర్థిక వృద్ధికి అడుగులేస్తున్నాయి. 3 ట్రిలియన్ల ఎకానమీ సాధించడమే కాక ప్రపంచ ఆర్థిక శక్తిగానూ ఎదగాలని కృషిచేస్తున్నాయి."
--మన్మోహన్ సింగ్, మాజీ ప్రధాని.
లక్షల్లో ఉద్యోగాలు..
సంక్షోభం సమయంలో 30 లక్షల మంది పేదరికం నుంచి బయటపడ్డారని సింగ్ తెలిపారు. లక్షల్లో యువతకు ఉపాధి కల్పించినట్లు పేర్కొన్నారు. ఈ సంస్కరణలు చేపట్టడంలో భాగస్వామ్యం వహించినందుకు ఆనందంగా ఉందని తెలిపారు. ఈ నిర్ణయాన్ని ఎల్లప్పుడూ సగర్వంగా భావిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. 1991 జులై 24న ఆయన ఇచ్చిన బడ్జెట్ ప్రసంగాన్ని గుర్తుచేసుకున్నారు.
రానున్న రోజులు మరింత క్లిష్టం..
కొవిడ్ మహమ్మారి కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోయారని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మన్మోహన్ సింగ్. ఎంతో మంది ఉపాధి కోల్పోవడం బాధాకరమని తెలిపారు. ఇదేమీ ఆనందించాల్సిన సమయం కాదని ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయమని పేర్కొన్నారు. రానున్న రోజులు.. 1991 ఆర్థిక సంక్షోభం కన్నా దారుణంగా ఉండబోతున్నాయని అభిప్రాయపడ్డారు. దేశంలో ప్రస్తుతం వైద్య, విద్యా రంగం పూర్తిగా వెనకబడిపోయాయని సింగ్ అన్నారు.
ఇదీ చదవండి:నిలకడగా మన్మోహన్ ఆరోగ్యం- ప్రముఖుల ఆరా