భవానీపుర్ ఉప ఎన్నికల్లో (Bhabanipur by-election) టీఎంసీ అధినేత్రి, ఆ పార్టీ అభ్యర్థి మమతా బెనర్జీ (Mamata Banerjee ) దూసుకుపోతున్నారు. సమీప ప్రత్యర్థి, భాజపా నేత ప్రియాంక టిబ్రివాల్కు అందనంత ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆరు రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యేసరికి మమతా బెనర్జీ 23,957 ఓట్ల ముందంజలో ఉన్నారు.
భవానీపుర్‌లో(Bhabanipur by poll) దీదీకి అసలు ఎదురే లేదని ఈ ఉప ఎన్నికతో మరోసారి నిరూపితమైంది. తొలి రౌండ్లోనే స్పష్టమైన ఆధిక్యాన్ని సంపాదించారు. ఆ తర్వాత రౌండ్ రౌండ్‌కూ మెజారిటీ పెరుగుతూ వస్తోంది. తొలిరౌండ్ పూర్తయ్యే సరికి.. 3,680, రెండో రౌండ్ తర్వాత 3,861, నాలుగో రౌండ్ అనంతరం 12,435 మెజారిటీ సంపాదించారు. మొత్తం 21 రౌండ్ల పాటు కౌంటింగ్ జరగనుంది.
ఆ రెండింటిలోనూ..
మరోవైపు, బంగాల్లో ఉపఎన్నిక జరిగిన మరో రెండు నియోజకవర్గాల్లోనూ టీఎంసీదే హవా నెలకొంది. సంసేర్గంజ్, జంగీపుర్ స్థానాల్లో కౌంటింగ్ జరుగుతుండగా.. ఇక్కడి నుంచి పోటీ చేసిన తృణమూల్ అభ్యర్థులే ఆధిక్యంలో ఉన్నారు. ఈ రెండు స్థానాలు సైతం టీఎంసీ ఖాతాలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.
నవంబర్ 30న ఈ మూడు స్థానాలకు ఉప ఎన్నిక జరిగింది. భవానీపుర్‌లో 53 శాతం పోలింగ్ నమోదు కాగా.. సంసేర్గంజ్, జంగీపుర్ స్థానాల్లో వరుసగా 78.60, 76.12 శాతం ఓట్లు పోలయ్యాయి.
ఇదీ చదవండి: దారుణం.. ఆరేళ్ల బాలుడ్ని సుత్తితో కొట్టి చంపిన బంధువులు