ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా సంస్థల మాజీ ఛైర్మన్ కేషుబ్ మహీంద్రా(99) బుధవారం దిల్లీలోని ఆయన నివాసంలో కన్నుముశారు. ఈయన మరణాన్ని ఇన్‌స్పేస్ ఛైర్మన్ పవన్ కే గోయెంకా ట్విట్టర్ వేదికగా ధ్రువీకరించారు.
"పారిశ్రామిక రంగంలో అత్యంత ఉన్నతమైన వ్యక్తులలో కేషుబ్ మహీంద్రా ఒకరు. ఈరోజు ఆయన్ను కోల్పోవడం చాలా బాధాకరం. నేను మంచి వ్యక్తులుగా భావించే వారిలో కేషుబ్ ఒకరు. నేను ఎప్పుడూ ఆయనతో కలిసేందుకు ఎదురు చూసేవాడిని. అలాగే ఈయన సాధించిన గొప్ప విషయాల నుంచి నేను ఎంతో ప్రేరణను పొందాను. ఓం శాంతి..!" అంటూ గోయెంకా ట్వీట్ చేశారు.
1923 అక్టోబరు 9న హిమాచల్ ప్రదేశ్ శిమ్లాలో జన్మించారు కేషుబ్ మహీంద్రా. అమెరికాలోని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలోని వార్టన్ స్కూల్‌లో ఉన్నత విద్యను అభ్యసించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కేషుబ్ మహీంద్రాకు స్వయాన మేనల్లుడు. 1947లో మహీంద్రా & మహీంద్రా గ్రూప్‌లో చేరిన కేషుబ్ మహింద్రా 1963లో సంస్థ ఛైర్మన్‌గా వ్యవహరించే స్థాయికి ఎదిగారు.
1984 డిసెంబర్లో భోపాల్‌లో భారీ గ్యాస్ లీక్ సంభవించినప్పుడు యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్‌కు నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఉన్నారు కేషుబ్ మహీంద్రా. ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన పారిశ్రామిక విపత్తుగా పేరు తెచ్చుకున్న ఆ ఘటనకు సంబంధించి 2010లో కేషుబ్ మహీంద్రాకు రెండు సంవత్సరాల జైలు శిక్ష పడింది. అనంతరం బెయిల్ పొందారు.
ప్రముఖ కంపెనీల్లో సభ్యుడిగా కేషుబ్..!
2004-2010 మధ్య కాలంలో వాణిజ్యం, పరిశ్రమలకు సంబంధించి ప్రధాన మంత్రి కౌన్సిల్‌లోని ముఖ్యుల్లో ఒకరిగా సేవలందించారు కేషుబ్ మహీంద్రా. ఈయన కృషికి అనేక జాతీయ, అంతర్జాతీయ గుర్తింపులు కూడా దక్కాయి. అసోచామ్, హడ్కో వంటి అనేక పారిశ్రామిక సంస్థలతో పాటు పలు సంఘాలతో కూడా కలిసి పనిచేశారు కేషుబ్. టాటా, సెయిల్, ఐఎఫ్‌సీ, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, ఈఎఫ్ఐ, ఏఐఎమ్‌ఏ, బాంబే డయింగ్, బాంబే బర్మా ట్రేడింగ్ కార్పొరేషన్ సహా అనేక ప్రముఖ కంపెనీల బోర్డులకు మెంబర్‌గా వ్యవహరించారు కేషుబ్.
ఎన్నో ఏళ్లుగా ఆటోమొబైల్ రంగంలో అగ్రగామిగా కొనసాగుతోంది మహీంద్రా & మహీంద్రా. కేషుబ్ సారథ్యంలోనే మహీంద్రా గ్రూప్ ఆటోమొబైల్స్‌లో అంచలంచెలుగా ఎదిగింది. మహీంద్రా ప్రసిద్ధ ఆవిష్కరణల్లో ఒకటైన విల్లీ జీప్‌లు ఒకప్పుడు ఎంతో ప్రజాదరణను కలిగి ఉన్నాయి. ఇవే కాకుండా ఆధునికతకు అనుగుణంగా వ్యవసాయం, విద్య, ఏరోస్పేస్ వంటి అనేక రంగాల్లో ఉపయోగపడే ఎన్నో పరికరాలను రూపొందించింది ఈ సంస్థ. ఆటోమొబైల్స్తో పాటు ఐటీ, హౌసింగ్, రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ పరిశ్రమల్లో కూడా ప్రవేశించి కొంత కాలంలోనే మంచి గుర్తింపును తెచ్చుకుంది మహీంద్రా గ్రూప్.