గుజరాత్‌లోని సురేంద్రనగర్ జిల్లాలో దారుణం వెలుగు చూసింది. గుండెలో రంధ్రం కారణంగా చనిపోయన ఏడాది వయసున్న చిన్నారిపై అత్యాచారం జరిగింది! ఖననం చేసిన మృతదేహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు బయటకు తీసి ఈ దారుణానికి తెగబడ్డట్టు తెలుస్తోంది. ఛిద్రమైన స్థితిలో బాలిక మృతదేహం బయట లభ్యమైంది. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఏమైందంటే?
సురేంద్రనగర్ జిల్లా థాన్ ప్రాంతానికి చెందిన ఏడాదిన్నర బాలికకు పుట్టుకతోనే గుండెలో రంధ్రం ఏర్పడింది. దీంతో ఈ నెల 25న ఆమెకు శస్త్రచికిత్స చేశారు వైద్యులు. అయినా బాలిక మరణించింది. ఈ క్రమంలో బాలికకు అంత్యక్రియలు నిర్వహించారు. మృతదేహాన్ని ఖననం చేశారు. అయితే, ఆ తర్వాత బాలిక మృతదేహం ఓ ప్రాంతంలో కనిపించింది. శరీరంపై గాయాలతో పూర్తిగా ఛిద్రమైన స్థితిలో మృతదేహం బయటపడింది.
చిన్నారి మృతదేహాన్ని ఎవరో బయటకు తీసి అత్యాచారం చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. బాలిక మృతదేహాన్ని స్వాధీనం ముందుగా సురేంద్రనగర్ జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం రాజ్‌కోట్‌లోని సివిల్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చిన్నారి ప్రైవేటు భాగాలు దెబ్బతిన్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అయితే, ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీస్ అధికారి తెలిపారు. అనంతరం బంధువులు బాలికకు మళ్లీ అంత్యక్రియలు నిర్వహించారు.
మహారాష్ట్ర సతారాలో ఓ వ్యక్తి తన ప్రేయసిని చంపి ఆత్మహత్య చేసుకున్నాడు. వంజోలీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. యువతీ యువకులు ఇద్దరూ గతంలో ప్రేమలో ఉన్నారు. యువతిని వివాహం చేసుకోవాలని అతడు భావించాడు. అయితే, రెండు నెలల క్రితం ఆమె వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఈ విషయంపై కోపం పెంచుకున్న యువకుడు.. యువతి తన తల్లి ఇంటికి వచ్చిన సమయంలో హత్యకు పాల్పడ్డాడు. తన ఇంటికి రావాలని పిలిచి.. పదునైన ఆయుధంతో పొడిచి చంపేశాడు. స్థానికులకు ఈ విషయం తెలియగానే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనాస్థలికి వచ్చిన పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనిపై ఔంధ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని, విచారణ జరుగుతోందని అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్ దత్తాత్రేయ దారడే వెల్లడించారు.