గుజరాత్‌లో 2002లో జరిగిన గోద్రా అల్లర్ల కేసులో ఎనిమిది మంది దోషులకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. నేర తీవ్రత దృష్ట్యా మరో నలుగురు దోషుల బెయిల్ పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది.
విచారణకు ముందు దోషులకు బెయిల్ ఇవ్వొద్దని సుప్రీంకోర్టులో గుజరాత్ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. దోషులు చేసింది చిన్న నేరం కాదనీ.. ప్రయాణికులను బోగీలో బంధించి బయట తలుపు గడియవేసి.. దానిపై రాళ్లు విసిరారని ఆయన గుర్తుచేశారు. గతంలో ట్రయల్ కోర్టు దోషులకు విధించిన మరణశిక్షను గుజరాత్ హైకోర్టు యావజ్జీవ కారాగార శిక్షగా మార్చడాన్నీ సవాల్ చేశారు.
దోషులపై TADA చట్టం ప్రయోగించినట్లు తెలిపిన గుజరాత్ ప్రభుత్వం.. వారిని ముందస్తుగా విడుదల చేయకూడదని విజ్ఞప్తి చేసింది. అటు దోషుల తరపున వాదనలు వినిపించిన న్యాయవాది.. వారు 17 ఏళ్లు జైలులో ఉన్నందున బెయిల్ మంజూరు చేయాలని సుప్రీంను కోరారు. వాదనలు విన్న సుప్రీంకోర్టు 8 మందికి బెయిలు మంజూరు చేసి మరో నలుగురి అభ్యర్థనలను తిరస్కరించింది.
ఇదీ కేసు..
2002 ఫిబ్రవరి 27న గోద్రాలో కరసేవకులు ప్రయాణిస్తున్న సబర్మతి ఎక్స్‌ప్రెస్‌లోని ఎస్6 బోగీని దహనం చేశారు. ఈ ఘటనలో 59 మంది ప్రాణాలు కోల్పోయారు. గోద్రా రైలు దహనంతో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. గుజరాత్‌వ్యాప్తంగా జరిగిన హింసాత్మక ఘటనల్లో సుమారు 1,200 మంది ప్రాణాలు కోల్పోయారు.
నరోదాగామ్ కేసులో ఊరట..
గుజరాత్ అల్లర్లకు సంబంధించిన నరోదాగామ్ కేసులో మాజీ మంత్రి మాయా కొద్నానీ, బజరంగ్‌దళ్‌కు చెందిన భజరంగి సహా 67 మందిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఈ మేరకు అహ్మదాబాద్‌కు చెందిన ప్రత్యేక న్యాయస్థానం గురువారం తీర్పు ఇచ్చింది. నరోదా గామ్‌లో ఇళ్లకు నిప్పు పెట్టడం వల్ల 11 మంది మృతి చెందారు. ఈ కేసులో మొత్తం 86 మంది నిందితులు కాగా.. విచారణ సమయంలోనే 18 మంది చనిపోయారు.
2017లో బీజేపీ అగ్రనేత అమిత్ షా కోర్టుకు హాజరై.. మాజీ మంత్రి మాయా కొద్నానీ తరపున సాక్ష్యమిచ్చారు. 2002లో నరేంద్ర మోదీ సారథ్యంలోని గుజరాత్ ప్రభుత్వంలో మాయ కొద్నానీ మంత్రిగా ఉన్నారు. 97 మందిని ఊచకోత కోసిన నరోదా పాటియా కేసులోనూ మాయ కొద్నానీ దోషిగా తేలారు. 28 ఏళ్ల జైలు శిక్ష విధించగా.. ఈ తీర్పును గుజరాత్ హైకోర్టులో సవాల్ చేశారు. ఉన్నత న్యాయస్థానం ఆమెకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.