మహారాష్ట్ర నాగ్‌పుర్‌లో అత్యంత పాశవిక ఘటన వెలుగు చూసింది. 17 ఏళ్ల బాలికపై కామాంధులు విరుచుకుపడ్డారు. బాలిక ప్రియుడు సహా అతని స్నేహితులు కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం మరో ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులూ ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు.
అసలేం జరిగింది?
బాధిత యువతి, ఆకాశ్ భండారీ అనే యవకుడు(20) ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. అక్టోబర్ 2 నుంచి 7 మధ్య ఆకాశ్‌తో పాటు అతని స్నేహితులు సందీప్ పంధారే(30), ఫిరోజ్ ఖాన్(24), అజయ్ సురంకర్(20).. యువతిపై నాగ్‌పుర్ నగర శివారులోని నిర్మానుష్య ప్రదేశంలో అత్యాచారానికి పాల్పడ్డారు.
మరో ముగ్గురూ..
అక్టోబర్ 7న ఆకాశ్‌తో పాటు బాధిత యువతి ఘటనాస్థలిలోనే ఉండగా.. అక్కడికి ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు చేరుకున్నారు. వారిని కొట్టి, ఆమెపై సామాహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ మేరకు పోలీసులు తెలిపారు.
బాధిత యువతి తనపై జరిగిన ఘోరాన్ని ఓ సామాజిక కార్యకర్తకు తెలియజేసింది. దాంతో అతడు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎండీసీ పోలీస్ స్టేషన్లో పోక్సో చట్టం సహా సంబంధిత సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు ఆకాశ్, సందీప్, ఫిరోజ్, అజయ్‌లను అరెస్టు చేశారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు.
ప్రేయసిని గొంతుకోసి హత్య..
మరో ఘటనలో ప్రేయసిని గొంతు కోసి హత్య చేశాడు ఓ కిరాతకుడు. యువతి తండ్రిపై ప్రతీకారంతో అతడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. రాజస్థాన్‌లో ఈ ఘటన జరిగింది.
కోటా జిల్లాలోని అమీర్పుర గ్రామానికి చెందిన జుబేర్(22) అనే వ్యక్తి... అదే గ్రామానికి చెందిన పూజా మెహర్(19) అనే యువతి రెండేళ్లుగా ఒకరినొకరు ప్రేమించుకున్నారు. అయితే.. వీరిద్దరి సామాజిక వర్గాలు వేరు కావడం వల్ల, వారి ప్రేమను యువతి తండ్రి రాధేశ్యామ్ అంగీకరించలేదు. జుబేర్‌ను నెలన్నర కింద కర్రలతో రాధేశ్యామ్ కొట్టాడు. దీంతో ఆగ్రహానికి గురైన జుబేర్.. అతడిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడని పోలీసులు తెలిపారు.
ఈ క్రమంలో పూజకు మరో వ్యక్తితో పెళ్లి ఖరారైంది. జుబేర్‌కు కూడా మరో యువతితో పెళ్లి కుదిరింది. శుక్రవారం ఉదయం పూజ తన ఇంటి నుంచి పొలం వద్దకు బయలుదేరగా.. ఆమెను జుబేర్ వెంబడించాడు. 11 గంటలకు పొలం వద్దకు చేరుకున్న అతడు... ఇతర మహిళలతో కలిసి వ్యవసాయ పనులు చేస్తున్న పూజను పక్కకు లాక్కెళ్లి, కత్తితో గొంతుకోశాడు.
రెండు గంటలకే అరెస్టు..
మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం.. కుటుంబ సభ్యులకు అప్పగించామని పోలీసులు తెలిపారు. హత్య జరిగిన రెండు గంటలకే నిందితుడు జుబేర్‌ను అరెస్టు చేసి, కేసు నమోదు చేశామని చెప్పారు. యువతి తండ్రి కొట్టినప్పటి నుంచి తనను పూజ చులకనగా చూసిందని నిందితుడు దర్యాప్తులో చెప్పాడని పేర్కొన్నారు.
గొడవలు జరగకుండా చూసేందుకు..
గ్రామంలో ప్రస్తుతం పరిస్థితి సాధారణంగానే ఉందని పోలీసులు తెలిపారు. యువతి అంత్యక్రియలు పూర్తయ్యాయని చెప్పారు. అయితే.. ఎలాంటి మతపరమైన గొడవలు తలెత్తకుండా అదనపు బలగాలను గ్రామంలో మోహరించామని పేర్కొన్నారు. మరో రెండు రోజుల పాటు అక్కడే ఉంటూ పరిస్థితిని పర్యవేక్షిస్తామని చెప్పారు.
ఇవీ చూడండి: