మహారాష్ట్ర పుణెలో గణేశ్ రఖ్ అనే ఓ డాక్టర్ వినూత్న సేవలందిస్తున్నారు. తన ఆసుపత్రిలో చేరిన గర్భిణీలకు ఆడపిల్ల పుడితే ఎటువంటి ఫీజు తీసుకోకుండా ఉచిత వైద్యం చేస్తున్నారు. ఆడపిల్లల భ్రూణ హత్యలను నివారించటానికి ప్రజలలో అవగాహన కల్పించేందుకు "బేటీ బచావో జనాందోళన్" అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తన ఆసుపత్రిలో చేరిన గర్భిణీలకు ఆడపిల్ల పుడితే ఎటువంటి ఫీజు తీసుకోకుండా ఉచిత వైద్యం చేస్తున్నారు.
మహారాష్ట్రలోని హదప్సర్ ప్రాంతంలో గణేశ్ రఖ్కు మెటర్నిటీ-కమ్-మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి ఉంది. ఈ ఆసుపత్రిలో 11 సంవత్సరాల నుంచి ఆయన ఉచిత వైద్యాన్ని అందిస్తున్నారు. ఇప్పటివరకు తన ఆసుపత్రిలో 2,400 మంది ఆడపిల్లలు పుట్టారు. ఈ డాక్టర్.. ఆడపిల్లల తల్లిదండ్రుల వద్ద ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉచిత వైద్యాన్ని అందించారు. ప్రభుత్వ సర్వే ప్రకారం, గత 10 ఏళ్లలో ఆరుకోట్ల భ్రూణ హత్య కేసులు నమోదయ్యాయని, ఇవన్నీ ఆడపిల్లలవేనని డాక్టర్ రఖ్ తెలిపారు.
"2012కు ముందు నేను ఆసుపత్రిలో కొన్ని భిన్న రకాలు అనుభవాలను ఎదుర్కొన్నాను. ఆసుపత్రిలో ప్రసవానికి వచ్చినవారు ఆడబిడ్డకి జన్మనిస్తే వారిని చూడటానికి కుటుంబ సభ్యులెవ్వరూ వచ్చేవారు కాదు. ఈ ఘటనలు నా మనసును కదిలించాయి. అందుకే ప్రజలలో లింగవివక్షతను తొలగించేందుకు ఏదైనా చేయాలనిపించింది. అందుకే 2012లో ఈ కార్యక్రమానికి పునాదులు వేశాను. ఆసుపత్రిలో ఆడశిశువు జన్మించిన తరువాత వారికి నామకరణం చేస్తే ఎటువంటి ఫీజు తీసుకోకూడదని నిర్ణయించుకున్నాను" అని డాక్టర్ రఖ్ చెప్పారు.
"ప్రభుత్వ సర్వే ప్రకారం, గత 10 ఏళ్లలో ఆరుకోట్ల ఆడ భ్రూణ హత్య కేసులు నమోదయ్యాయి. ఈ హత్యలకు కారణం ప్రజలు మగబిడ్డ కావాలనే గట్టి ఆలోచనను కలిగి ఉండటమే. ఇది ఒక ప్రాంతానికి, రాష్ట్రానికి, దేశానికి చెందిన సమస్య కాదు. ఇది ప్రపంచం అంతటా ఉన్న పెద్ద సమస్య" అని ఆయనన్నారు.
ఈ క్రమంలోనే ఆసుపత్రిలో గతనెల 26న ఒక ఆడ, మగ కవలలకు జన్మనిచ్చిన మహిళ డిశ్చార్జ్ అవుతుండగా ఆసుపత్రి సిబ్బంది ఓ చిన్న వేడుకను నిర్వహించింది. ఈ వేడుకలో భాగంగా ఆసుపత్రిని పూలు, బెలూన్లుతో అలంకరించి.. మహిళతో కేక్ కట్ చేయించారు. ఆసుపత్రి నుంచి బయలుదేరినప్పుడు ఆ కవలలపై పూల రేకులు కురిపించారు. ఈ వేడుకలను చూసి ఎంతో మురిసిపోయామని పిల్లల తల్లిదండ్రులు చెప్పారు. పిల్లల డిశ్చార్జ్ సమయంలో ఆడపిల్లల తల్లిదండ్రులు తమ ఆడబిడ్డను చూసి గర్వపడాలనే ఉద్దేశంతోనే ఈ వేడుకలను నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమంలో భాగస్థుడైన డాక్టర్ లాలాసాహెబ్ గైక్వాడ్ తెలిపారు.
ఇవీ చదవండి:హిందుత్వ నేతలకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఇచ్చిన పోలీసులు
దక్షిణాదిలో వందేభారత్ కూత.. 6గంటల్లోనే చెన్నై నుంచి మైసూర్‌కు ప్రయాణం