కోల్‌కతాకు చెందిన పీపుల్ రిలీఫ్ కమిటీ తన 80వ వార్షికోత్సవం సందర్భంగా.. ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తోంది. కేవలం 50 రూపాయలకే హెర్నియా ఆపరేషన్లను నిర్వహించేందుకు ముందుకొచ్చింది. 1943 సంవత్సరంలో ప్రారంభమైన ఈ సంస్థ.. 2023లో 80 సంవత్సరాలు పూర్తిచేసుకోనుంది. ఈ నేపథ్యంలోనే 80 రకాల సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. స్వాతంత్య్రం పూర్వం నుంచే ఎన్నో వైద్య పరీక్షలను, ఆరోగ్య సదుపాయాలను అతి తక్కువ ధరలకే అందించిన తమ సంస్థ నేటికి సమాజ శ్రేయస్సు కోసం పాటు పడుతున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.
"మురికి వాడల్లో ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేసి అక్కడ నివసించే వారికి రక్త పరీక్షలు, ఇతర రోగ నిర్దారణ పరీక్షలు చేయనున్నాం. అక్కడ ప్రబలే వ్యాధుల నిర్మూలకు కృషి చేస్తాం. ఇప్పటికే మేము చాలా ప్రాంతాల్లో మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశాం. రక్తదాన కార్యక్రమం సైతం జరుగుతోంది. మలేరియా, డెంగీ, ఇతర వ్యాధుల నిర్ధరణ, నిర్మూలన కార్యక్రమాలు జరుగుతున్నాయి. సాధారణంగా హెర్నియా ఆపరేషన్‌కు రూ.10వేలు ఖర్చు అవుతుంది. మేం మాత్రం కేవలం రూ.50కే చేయనున్నాం. ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి కళ్లద్దాలు సైతం పంపిణీ ఇవ్వనున్నాం. వైద్యఖర్చులు భరించలేని వారికి పూర్తి ఉచితంగా సేవలు అందించనున్నాం" అని సంస్థ సెక్రెటరీ ఫాడ్ హలిమ్ అన్నారు
"తలసేమియా, హిమోగ్లోబిన్ సంబంధిత వ్యాధులను గుర్తించి చికిత్స అందిస్తున్నాం. మా సంస్థ 80వ వార్షికోత్సవం సందర్భంగా కార్యక్రమాల సంఖ్యను, పరిధిని పెంచాం" అని సంస్థ అధ్యక్షుడు, ప్రముఖ సినీ దర్శకుడు కమలేశ్వర్ ముఖర్జీ తెలిపారు.
పక్షవాతం నుంచి కోలుకొన్న 102 ఏళ్ల వృద్ధుడు:
102 ఏళ్ల వృద్ధుడు పక్షవాతం నుంచి కోలుకొని అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. కర్ణాటకకు చెందిన ఓ వృద్ధుడి కుడిచేయి పక్షవాతంతో పూర్తిగా పడిపోయింది. దాంతో అతడిని బెంగళూరులోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో చేరిన వృద్ధుడికి వెంటనే చికిత్స చేశారు వైద్యులు. దీంతో వృద్ధుడు తన చేతిని 50 శాతం పైకెత్తగలిగాడు. మరో గంటన్నరలో 90 శాతం వరకు పైకెత్తగలిగాడు. దీంతో అతనికి ప్రమాదం తప్పింది. వృద్దుడి 102 ఏళ్లు ఉన్నప్పటికీ గుండె ధైర్యమే అతన్ని బతికించినట్లు వైద్యులు చెబుతున్నారు.