AMARAVATI FARMERS PROTEST @ 1200 : ఒకటా.. రెండా.. ఏకంగా పన్నెండు వందల రోజులు. రాజధాని అమరావతి విధ్వంసానికి కంకణం కట్టుకున్న వైసీపీ ప్రభుత్వంపై రాజధాని రైతులు ఉద్యమ బావుటా ఎగరవేసి నేటికి పన్నెండు వందల రోజులు. ప్రభుత్వ దమననీతిని, పోలీసుల దాడులు, నిర్బంధాలు, అక్రమ కేసులను తట్టుకుని రైతులు ఉద్యమం కొనసాగిస్తున్నారు. రాజధాని అమరావతిని కాపాడుకునేందుకు పోరాడుతున్నారు.
రైతులను వెన్నుపోటు పొడిచిన జగన్: అమరావతే రాజధానిగా కొనసాగుతుందని 2019 ఎన్నికల సమయంలో చెప్పి.. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ రెడ్డి మాట తప్పారు. మూడు రాజధానుల పేరిట రైతులను నట్టేట ముంచారు. జగన్ పొడిచిన వెన్నుపోటుతో రాజధానికి భూములు ఇచ్చిన రైతన్నలు రోడ్డు పైకి వచ్చారు. ప్రభుత్వం తమకు చేసిన అన్యాయాన్ని నిరసిస్తూ ఆందోళనలు నిర్వహించారు. 2019 డిసెంబర్ 17న ప్రారంభమైన నిరసనలు వివిధ రూపాల్లో ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. భూములిచ్చిన రైతులకు మద్దతుగా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఆందోళనలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ అంతా "జై అమరావతి" అంటూ నినదించారు. ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులకు మద్దతుగా ఉద్యమాలు నిర్వహించారు. రైతుల పోరాటం కొన్నాళ్లే చేస్తారని భావించిన ప్రభుత్వం.. చివరకు ఖంగుతింది. దాదాపు 12వందల రోజులైనా అమరావతి ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది.
ప్రభుత్వ తీరుపై వివిధ పద్ధతుల్లో నిరసన తెలిపిన రైతులు: ఉద్యమం ప్రారంభించిన కొన్నాళ్లకే కరోనా విపత్తు వచ్చినా.. రైతులు తలొగ్గలేదు. కరోనా నిబంధనలు పాటిస్తూనే తమ పోరాటాన్ని కొనసాగించారు. రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో దీక్షా శిబిరాలు ఏర్పాటు చేసిన రైతులు.. సర్కారుపై సమర శంఖం పూరించారు. ప్రభుత్వ ఒత్తిళ్లు, పోలీసుల నిర్బంధాలను ఉక్కు సంకల్పంతో ఎదుర్కొని.. ఉద్యమాన్ని ఉరకలెత్తించారు. పోలీసుల లాఠీ దెబ్బలు, అరెస్టులతో రైతులు వెనక్కి తగ్గుతారని భావించిన ప్రభుత్వం ఆలోచనలను అన్నదాతలు పటాపంచలు చేశారు. కేసులు పెట్టినా మరింత పట్టుదలతో ముందుకు కదిలారు.
100వ రోజు నిరసనలు, 200వ రోజు అమరావతి అమరవీరులకు ప్రత్యేక శ్రద్ధాంజలి, 300వ రోజు అమరవీరుల ఫ్లెక్సీలతో శవయాత్ర, 400వ రోజు జన భేరి, 500వ రోజు రాష్ట్ర, జాతీయ నాయకులతో జూమ్ సదస్సు, 600వ రోజు మానవహారాలు నిర్వహించారు. ఆ తర్వాత ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో 2021 నవంబర్ 1న తిరుమలకు పాదయాత్రగా వెళ్లారు. పాదయాత్ర సమయంలోనే ఉద్యమం 700 రోజులకు చేరుకుంది. తిరుమల వెంకన్న పాదాలకు మొక్కి అమరావతిని రాజధానిగా కొనసాగించాలని వేడుకున్నారు. 800వ రోజు సందర్భంగా రాజధాని రైతులు 24 గంటల నిరాహారదీక్ష చేపట్టారు. కొద్దిరోజులకే అమరావతికి మద్దతుగా హైకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది. నమ్ముకున్న న్యాయస్థానం కరుణించిందని.. సంతోషం వ్యక్తం చేశారు. అక్కడి నుంచి రైతుల ఉద్యమ పంథాను మార్చారు. అమరావతిని త్వరితగతిన నిర్మించాలంటూ "బిల్డ్ అమరావతి..సేవ్ ఆంధ్రప్రదేశ్" అంటూ నినాదాన్ని అందుకున్నారు.
రెండో విడత పాదయాత్ర: ఉద్యమం ప్రారంభించి వెయ్యి రోజులు పూర్తి చేసిన సందర్భంగా రైతులు రెండో విడత పాదయాత్ర చేపట్టారు. అరసవెల్లి వరకూ చేపట్టిన మహా పాదయాత్రను ప్రభుత్వం నిబంధనల పేరుతో అడుగడుగునా.. అడ్డుతగిలింది. అయినా ప్రజల సహకారంతో ముందుకు సాగారు. అమరావతి భూములను అమ్మకానికి పెట్టడం, ఆర్ 5 జోన్ ఏర్పాటు కోసం ప్రభుత్వం అడుగులు వేయడంతో రైతులు అప్రమత్తం అయ్యారు. మళ్లీ అమరావతి వచ్చి ఇక్కడి నుంచి పోరాటం సాగిస్తున్నారు. అమరావతికి అనుకూలంగా హైకోర్టు తీర్పు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వైసీపీను గద్దె దించేంతవరకు తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని తేల్చి చెప్పారు.
నేడు ప్రత్యేక కార్యక్రమాలు: ఉద్యమం ప్రారంభించిన నేటికి 12వందల రోజులు అవుతున్న సందర్భంగా రైతులు అన్ని పార్టీల నేతలతో కలిసి ప్రత్యేక నిరసన తెలుపనున్నారు. తెలుగుదేశం, వామపక్షాలు, జనసేన, భారతీయ జనతా పార్టీల నేతలు, ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన వైసీపీ ఎమ్మెల్యేలు ఈ నిరసన సభలో పాల్గొననున్నారు. మందడంలో జరిగే ఈ సభతో ప్రభుత్వానికి తమ ఉద్దేశాన్ని తెలియజేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు.
ఇవీ చదవండి: