అతడికి మూడేళ్లే. అయితేనేం అసమాన ప్రతిభ, అద్భుతమైన జ్ఞాపకశక్తి అతడి సొంతం. ఈ వయసులోనే వివిధ దేశాల పేర్లు చెబుతూ, వాటి జెండాలను గుర్తిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. పక్షులు, జంతువులు, పండ్లు, పూల పేర్లను ఇట్టే చెప్పేస్తున్నాడు. చారిత్రక ప్రదేశాలు, ప్రముఖ శాస్త్రవేత్తలు.. వారి ఆవిష్కరణలను సైతం వివరిస్తున్నాడు. వయసుకు మించిన పనులు చేస్తూ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించబోతున్నాడు ఈ బాలుడు.
దిల్లీ రోహిణి సెక్టార్ 21లో నివాసముంటున్న జ్ఞాన్ ప్రకాశ్ దంపతుల రెండో సంతానం దేవాన్ష్. అతడి వయసు మూడేళ్లే. అయితేనేం అద్భుతమైన జ్ఞాపకశక్తితో అందరినీ అబ్బుర పరుస్తున్నాడు. 215 దేశాల పేర్లు చెబుతూ.. వాటి జెండాలను గుర్తుపడుతున్నాడు. ఇవే కాకుండా.. 50 మంది శాస్త్రవేత్తల పేర్లు, వారి ఆవిష్కరణలను ఇట్టే చెప్పేస్తున్నాడు. దేశంలోని అన్ని రాష్ట్రాలనూ, వాటి రాజధానులను అలవోకగా చెప్పగలడు. 20 రకాల పండ్లు, పూలు వాటి శాస్త్రీయనామాలను వివరిస్తున్నాడు. 16 రకాల ఆకారాలను, 15 రంగుల పేర్లను.. అనేక రకాలైన జీవ రాశుల పేర్లను చెబుతున్నాడు. 16 రకాల వాహనాలు, 12 చారిత్రక ప్రదేశాలు, 16 మంది ప్రముఖుల విశేషాలు, గ్రహాలు, అనేక రకాల వాయిద్య పరికరాలను గుర్తిస్తున్నాడు.
"దేవాన్ష్ సోదరి ఓ స్పీచ్ కోసం సిద్ధం అవుతోంది. ఆమె పక్కనే కూర్చుని నాలుగు రోజులు విన్నాడు. ఓ రోజు రాత్రి పడుకోవడానికి రాలేదు. చూడటానికి వెళ్లగా పక్క గదిలో అద్దం ముందు నిలబడి స్పీచ్‌ను మొత్తం అప్పచెప్పాడు. అందులో చాలా కఠిన పదాలు ఉన్నాయి. అయినా సరే అలవోకగా చెప్పాడు." -జ్ఞాన్ ప్రకాశ్, దేవాన్ష్ తండ్రి
దేవాన్ష్ అసమాన ప్రతిభ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులను సైతం కట్టిపడేసింది. దేవాన్ష్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాడని.. త్వరలోనే సర్టిఫికెట్ అందుకోబోతున్నాడని అతని తండ్రి జ్ఞాన్ ప్రకాశ్ తెలిపారు. గతంలో హరియాణాకు చెందిన 'వండర్ బాయ్' కౌటిల్య పండిత్‌కు ప్రోత్సాహం అందించినట్లుగానే దేవాన్ష్‌కు సహాయం అందించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఇవీ చదవండి: 'అమృతగాథ' పుస్తకం ఆవిష్కరించిన మోదీ.. ఈనాడుపై ప్రశంసలు
కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి, గణేశుడి ఫొటోలు.. ప్రధానిని కోరిన దిల్లీ సీఎం