ఉత్తరాఖండ్ జోషీమఠ్‌లో భూమి కుంగిపోయి వందలాది ఇళ్లు దెబ్బతిన్న తరహా ఘటన జమ్ముకశ్మీర్‌లో జరిగింది. దోడా జిల్లాలోని థాత్రి ప్రాంతంలో భూమి కుంగిపోయి శుక్రవారం 15 ఇళ్లు దెబ్బతిన్నాయి. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. బాధిత కుటుంబాలను సురక్షిత ప్రదేశాలకు తరలించారు.
సమీప ప్రాంతాల్లో జరిపిన తవ్వకాల వల్లే ఇళ్లు దెబ్బతిన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అలాగే తమను సురక్షిత ప్రదేశాలకు తరలించడంలో స్థానిక యంత్రాంగం ఉదాశీనంగా వ్యవహరించిందని ఆరోపించారు. తామే బంధువులు, సన్నిహితులు ఇంటికి వెళ్లి ప్రాణాలు కాపాడుకున్నామని తెలిపారు.
ఇళ్లు పగుళ్లు ఏర్పడడానికి గల స్పష్టమైన కారణాలు ఇంకా తెలియలేదు. అయితే సమీప ప్రాంతంలో బుల్డోజర్తో తవ్వకాలు జరపడం వల్లే భూమి కుంగిపోయిందని.. అందుకే తమ ఇళ్లు పగుళ్లు ఏర్పడ్డాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. వీలైనంత త్వరగా ఇళ్లు పగుళ్లు ఏర్పడడానికి గల కారణాలను తెలుసుకుంటాం. మరోవైపు బుల్డోజర్తో తవ్వకాల జరపడం వల్ల కొండచరియలు విరిగిపడే అవకాశం లేదు. కొండచరియలు విరిగిపడటానికి గల కారణాలను తెలుసుకునేందుకు జియోలాజికల్ నిపుణులను కూడా రప్పిస్తున్నాం.
--స్థానిక యంత్రాంగం