Corona test guidelines: వయసు రీత్యా, అనారోగ్య సమస్యల పరంగా తీవ్ర ముప్పు (హైరిస్క్) కేటగిరీలోకి రాకపోతే కొవిడ్ నిర్ధారితులకు సన్నిహితంగా మెలిగిన (కాంటాక్ట్స్) వారికి పరీక్షలు అవసరం లేదని ఐసీఎంఆర్ పేర్కొంది. కరోనా పరీక్షల నిర్వహణపై ఆ సంస్థ సోమవారం మార్గదర్శకాలు జారీచేసింది. లక్షణాలు లేని వ్యక్తులు, హోం ఐసోలేషన్ మార్గదర్శకాల ప్రకారం డిశ్చార్జి అయిన పేషెంట్లు, కేంద్ర ప్రభుత్వం సవరించిన నిబంధనల మేరకు కొవిడ్ ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయిన వారు, రాష్ట్రాల మధ్య ప్రయాణించే వారు...కొవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదని తాజాగా పేర్కొంది.
వీరికి పరీక్షలు తప్పనిసరి...
- దగ్గు, జ్వరం, గొంతులో సమస్య, రుచి, వాసన కోల్పోయినవారు, శ్వాస సమస్యను ఎదుర్కొంటున్న వ్యక్తులు..
- కొవిడ్ నిర్ధారితులకు సన్నిహితంగా మెలిగిన వారిలో 60 ఏళ్లకు పైగా వయసు ఉండి, మధుమేహం, బీపీ, దీర్ఘకాలంగా ఊపిరితిత్తులు, కిడ్నీ, కేన్సర్, స్థూలకాయం సంబంధిత సమస్యలతో బాధపడుతున్నవారు.
- అంతర్జాతీయ ప్రయాణాలు చేసేవారు, విదేశాల నుంచి భారత్‌కు విమానాలు, నౌకల ద్వారా వచ్చే వారు..
- ఆసుపత్రుల్లో చేరిన వారు వైద్యుల సూచన మేరకే పరీక్ష చేయించుకోవాలి.
ఇంటి వద్ద పరీక్షల్లో పాజిటివ్ వస్తే...
హోం, సెల్ఫ్, ర్యాట్ టెస్టుల్లో పాజిటివ్ వస్తే దాన్ని పరిగణలోకి తీసుకోవాలని, మళ్లీ పరీక్ష చేయించాల్సిన అవసరం లేదని ఐసీఎంఆర్ పేర్కొంది. ఒకవేళ నెగెటివ్ వచ్చినప్పటికీ కొవిడ్ లక్షణాలు కనిపిస్తుంటే మాత్రం ఆర్‌టీపీసీఆర్ పరీక్ష చేయించుకొనేలా చూడాలని సూచించింది.
ఈ కిట్లు ఉపయోగించవచ్చు
కరోనా నిర్ధారణ పరీక్షలను ఆర్‌టీపీసీఆర్, ట్రూనాట్, సీబీనాట్, సీఆర్‌ఐఎస్‌పీఆర్, ఆర్‌టీ-ల్యాంప్, ర్యాపిడ్ మాలిక్యులర్ టెస్టింగ్ సిస్టమ్స్, ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ కిట్ల ద్వారా నిర్వహించవచ్చని తెలిపింది.
కొవిడ్ పరీక్షల కోసం వచ్చే వారి టీకా పరిస్థితి గురించి తప్పనిసరిగా నమోదుచేయాలని, ఈ సమాచారం అత్యవసరమని ఐసీఎంఆర్ పేర్కొంది.అత్యవసర వైద్యసేవలు తిరస్కరించొద్దు
పరీక్షలు చేయించుకోలేదన్న పేరుతో శస్త్రచికిత్స, ప్రసవంలాంటి అత్యవసర వైద్య సేవలు నిలిపేయడానికి వీల్లేదని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. పరీక్ష సౌకర్యం లేదన్న సాకుతో వేరే ఆసుపత్రులకు వెళ్లాలనీ చెప్పరాదు. రోగుల నుంచి నమూనాలు సేకరించి, ప్రయోగశాలలకు పంపే ఏర్పాట్లను ఆసుపత్రులే చేసుకోవాలని ఐసీఎంఆర్ నిర్దేశించింది. శస్త్ర చికిత్సలు, కాన్పుల కోసం వచ్చే వారికి కరోనా లక్షణాలు కనిపించకుంటే అత్యవసరమైతే తప్ప పరీక్షలు నిర్వహించరాదని పేర్కొంది.
ఇదీ చదవండి: దేశంలో తగ్గిన కరోనా కేసులు.. మరో 1.68లక్షల మందికి వైరస్