CID Arrested Chandrababu in the Case of Skill Development Centers: నైపుణ్యాభివృద్ధి కేంద్రాల కేసులో చంద్రబాబుపై ప్రభుత్వం అనేక సెక్షన్ల కింద కేసు పెట్టి, అరెస్టు చేసిన తీరు చూసి పాలనా వ్యవహారాల్లో విశేష అనుభవం ఉన్న ప్రస్తుత, మాజీ ఉన్నతాధికారులు, రాజకీయ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సీఐడీ విచారణ తీరుపైనా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లో రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసి, కొన్నేళ్ల క్రితం పదవీవిరమణ చేసిన విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేష్‌పై కూడా సీఐడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఆ ప్రాజెక్టు విషయంలో అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు మీపై ఏమైనా ఒత్తిడి తెచ్చారా? అంటూ కనీసం పదిసార్లు రమేష్‌ని సీఐడీ అధికారులు గుచ్చిగుచ్చి అడిగినట్టు సమాచారం.
నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టుకు అప్పటి సీఎస్ ఐ.వై.ఆర్.కృష్ణారావు, అప్పట్లో ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేసిన అజేయకల్లం ఆమోదం తెలిపారు. సీమెన్స్, డిజైన్‌టెక్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోవడం, వాటికి నిధుల విడుదలలో అప్పటి నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ ఎల్.ప్రేమ్‌చంద్రారెడ్డి కీలకపాత్ర పోషించారు. ఆ విషయాన్ని అప్పట్లో ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్న పి.వి.రమేష్ సీఐడీకి ఇచ్చిన వాంగ్మూలంలో స్పష్టంగా పేర్కొన్నారు. కానీ వారిని సీఐడీ విచారించిందో లేదో తెలీదు. వారిద్దరూ ఇప్పుడూ రాష్ట్రప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉన్నారు. వారి జోలికి వెళ్లకుండా.. చంద్రబాబును ఏదో ఒక కేసులో ఇరికించాలన్న ఉద్దేశంతో తమకు నచ్చిన అభియోగాలన్నీ మోపి అరెస్టు చేసినట్టు కనిపిస్తోందని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Skill Development Case.. స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో లేని అవినీతిని ఉన్నట్టు చూపడానికి జగన్‌రెడ్డి, సీఐడీ అధికారులు పిల్లిమొగ్గలు వేస్తున్నారు. ఈ కేసులో 22 నెలలుగా దర్యాప్తు చేస్తున్న సీఐడీ గతంలో ఎప్పుడూ చంద్రబాబు పేరు ప్రస్తావించలేదు. ఈడీ విచారణలోనూ ఆయన పేరు లేనప్పడు ఇప్పుడు ఎలా అరెస్టు చేశారని తెలుగుదేశం సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత ప్రభుత్వ హయాంలో నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టుల నిధులు మళ్లించారన్న ఆరోపణ పూర్తి అసంబద్ధమని, సీమెన్స్ సంస్థతో కలసి నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటుకు గుజరాత్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలు చేసిన వ్యయం కంటే, ఏపీ చేసిన ఖర్చే తక్కువని ఆ ప్రాజెక్టుపై మంచి అవగాహన ఉన్న అధికారి ఒకరు తెలిపారు. గుజరాత్‌లో 2013లో అప్పటి నరేంద్రమోదీ ప్రభుత్వం సీమెన్స్‌తో కలిసి ఏడు సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లు, ఒక్కో సెంటర్‌లో ఏడు ల్యాబ్‌లు ఏర్పాటు చేసిందని ఆయన పేర్కొన్నారు. అక్కడ ఒక్కో సీఓఈకి 71 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఏపీలో పెట్టింది 61 కోట్లేనని తెలిపారు. ఏపీలో ఆరు సీఓఈలకు 371 కోట్లు ఖర్చుచేస్తే, అప్పట్లో మోదీ ప్రభుత్వం ఏడు సీఓఈలకు 479 కోట్లు వెచ్చించింది. కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్ కూడా సీమెన్స్‌తో కలిసే నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేశాయి అని పేర్కొన్నారు.
Arguments in ACB Court: లాయర్ అవతారమెత్తిన చంద్రబాబు.. తన కేసును తానే వాదించుకున్న టీడీపీ అధినేత
ఈ కేసులో సీఐడీ దర్యాప్తు(CID investigation) తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. ఆ ప్రాజెక్టులో అధికారుల పాత్రను తెరపైకి ఎందుకు తీసుకురావడం లేదన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి. సీమెన్స్, డిజైన్‌టెక్ సంస్థలతో, ఏపీఎస్‌ఎస్‌డీసీ ఒప్పందం చేసుకోవడానికి అనుమతిస్తూ 2015 జూన్ 30న అప్పటి సీఎస్ ఐ.వై.ఆర్.కృష్ణారావు జీవో ఇచ్చారు. ఒప్పందంపై అప్పటి ఎస్‌డీఈ అండ్ ఐ విభాగం కార్యదర్శి ప్రేమ్‌చంద్రారెడ్డి సంతకం చేశారు. కార్యక్రమం సక్రమంగా అమలయ్యేలా చూసేందుకు ఐ.వై.ఆర్. కృష్ణారావు రెండు కమిటీలను ఏర్పాటుచేశారు. మొదటి కమిటీలో ఐఏఎస్ అధికారులు రవిచంద్ర, ఎస్.ఎస్.రావత్, అజయ్‌జైన్, ఉదయలక్ష్మి, విశ్రాంత ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ, గంటా సుబ్బారావు, సీమెన్స్, డిజైన్‌టెక్ ప్రతినిధులు ఉన్నారు.
CID Investigation in Chandrababu Case..సెంటర్ల ఏర్పాటును పర్యవేక్షించేందుకు రావత్, అజయ్‌జైన్, ఉదయలక్ష్మి, గంటా సుబ్బారావు, లక్ష్మీనారాయణలతో మరో కమిటీ వేశారు. అప్పట్లో రాష్ట్రప్రభుత్వం తనవంతు నిధుల్ని ముందుగా విడుదల చేసేలా ఆర్థికశాఖను ఒప్పించడంలో ప్రేమ్‌చంద్రారెడ్డి క్రియాశీలకంగా వ్యవహరించినట్టు సమాచారం. కేసు దర్యాప్తు సందర్భంగా ఏ అధికారీ చంద్రబాబు పేరు చెప్పకపోయినా.. నాటి ముఖ్యమంత్రి చెబితేనే నిధులు విడుదల చేశామని అధికారులు చెప్పినట్టుగా సీఐడీ చీఫ్ సంజయ్ పేర్కొనడాన్ని బట్టే ప్రభుత్వ ఉద్దేశం అర్థమవుతోంది. అప్పట్లో నిధులు విడుదల చేసిన ప్రేమచంద్రారెడ్డిని ఎందుకు విచారించలేదని టీడీపీ నేత నరేంద్ర నిలదీశారు.
గత ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ప్రాజెక్టు చేపట్టేనాటికి అజేయ కల్లం ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి. ప్రస్తుతం ఆయన సీఎం జగన్‌కు ముఖ్య సలహాదారు. పీవీ రమేష్ అప్పట్లో ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేశారు. అప్పట్లో నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ప్రాజెక్టుకు అజేయ కల్లమే ఆమోదం తెలిపారు. ఆర్థికశాఖలో నైపుణ్యాభివృద్ధి విభాగం వ్యవహారాల్ని చూస్తున్న తన సూచనల్ని పట్టించుకోకుండా, కనీసం తనకు చెప్పకుండా అజేయకల్లం ప్రాజెక్టుకు ఆమోదం తెలిపినట్టు సీఐడీకి ఇచ్చిన వాంగ్మూలంలో రమేష్ పేర్కొన్నారు. పీవీ రమేష్‌పై సీఐడీ పలుదఫాలు ప్రశ్నల వర్షం కురిపించింది. దానికి ఆయన సమాధానాలిచ్చారు.
CID Arrested Chandrababu.. ప్రైవేటు సంస్థకు ప్రజాధనాన్ని ముందుగా చెల్లించడం సరైన పద్ధతి కాదని, కావాలంటే ఎస్క్రో ఖాతాలో నిధులు జమ చేయాలని సూచించాను. కాని పక్షంలో సీమెన్స్ సంస్థ, ప్రభుత్వం 90:10 దామాషాలో పనుల పురోగతిని బట్టి దఫదఫాలుగా నిధులు విడుదల చేయాలని సూచించాను. కానీ ఒప్పందంలో అలాంటి మార్పులేమీ చేయకుండానే అజేయ కల్లం ఆమోదం తెలిపేశారు.. అని రమేష్ పేర్కొన్నారు. అజేయకల్లం స్థానంలో తాను ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి అయ్యాక ముందస్తుగా నిధుల విడుదలకు అంగీకరించలేదని, కానీ తాను చేసిన సూచనలన్నీ కచ్చితంగా పాటిస్తామని ప్రేమ్‌చంద్రారెడ్డి హామీ ఇచ్చాకే సమ్మతించానని రమేష్ తెలిపారు.
Setting up of Skill Development Centres: నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటుకు రాష్ట్రప్రభుత్వం తన వాటా నిధుల్ని ముందుగా ఇచ్చేసిందన్నది సీఐడీ ప్రధాన అభియోగం. మరి జగన్ తండ్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరుతో జలయజ్ఞంలో గుత్తేదారులకు వందల కోట్లు కట్టబెట్టడాన్ని ఏమంటారని టీడీపీ నాయకులు, నిపుణులు ప్రశ్నిస్తున్నారు. మొబిలైజేషన్ అడ్వాన్సులు తీసుకున్న సంస్థలు ఆ పనులు చేయకుండా వెళ్లిపోతే.. దాన్ని బాధ్యుడిని చేస్తూ ఆ విధానం ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రిని అరెస్టు చేస్తారా? ఇప్పుడు చంద్రబాబు అరెస్టూ అలాంటిదే అని ఒక అధికారి పేర్కొన్నారు.