దేశంలో ఇప్పటివరకు రెండు కరోనా మరణాలు సంభవించాయి. వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చర్యలు చేపట్టాయి.
అయితే ఇప్పుడు కరోనాతో కొత్త సమస్య వచ్చింది. అదేంటంటే? కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలను ఏం చేస్తారు? అంత్యక్రియలు ఏ విధంగా నిర్వహిస్తారు? అవును.. ఇప్పుడు ఈ విషయాలపై మార్గదర్శకాలను తయారు చేసేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది.
మృతదేహం నుంచి కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందా? అనే విషయంపై ప్రజలకు అవగాహన తెచ్చేందుకు మార్గదర్శకాలను సిద్ధం చేస్తున్నట్లు ఆరోగ్యశాఖ అధికారి ఒకరు తెలిపారు.
"కరోనా వైరస్ శ్వాససంబంధమైన వ్యాధి. ఇది సూక్ష్మ బిందువుల ద్వారా సంక్రమిస్తుంది. అయితే వైరస్ సోకిన మృతదేహాలను తాకడం ద్వారా...వ్యాధి సోకే అవకాశం తక్కువే. ఎబోలా, నిఫా వైరస్ విషయంలో మాత్రం చనిపోయిన వారి మృతదేహాలను ప్రత్యక్షంగా తాకితే వ్యాధి సోకే అవకాశాలు ఎక్కువ." - ఆరోగ్యశాఖ అధికారి
- శ్వాససంబంధ, అంటువ్యాధుల నియంత్రణ, నివారణపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) పలు మార్గదర్శకాలను ప్రకటించింది.
- వైరస్ సోకిన మృతదేహాలను ఐసోలేషన్ గది లేదా ప్రాంతం నుంచి తరలించేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోవాలి.
- ప్రత్యక్షంగా వారి శరీరాన్ని తాకకుండా నిర్దిష్ట వ్యక్తిగత రక్షణ సామగ్రిని వినియోగించాలి.
- మృతదేహాలను తరలించే సమయంలో లాంగ్ స్లీవ్ కఫ్డ్ గౌన్లను ధరించాలి. గౌన్ వాటర్‌ప్రూఫ్ అయితే ఇంకా మంచిది.
- పంచనామా పరీక్షల అనంతరమూ మృతదేహాన్ని పూర్తిగా ప్యాక్ చేసి శ్మశానానికి తరలించాలి.
- మార్చరీ, శ్మశానవాటిక సిబ్బంది ఖచ్చితంగా సరైన జాగ్రత్తలు పాటించాలి. ముఖంతో సహా వ్యక్తిగత రక్షణ సామగ్రి ధరించాలి.
అత్యంత జాగ్రత్తగా...
దిల్లీలో కరోనాతో మృతి చెందిన 68 ఏళ్ల వృద్ధురాలి అంత్యక్రియలను శనివారం వైద్యసిబ్బంది పర్యవేక్షణలో అత్యంత జాగ్రత్తగా నిర్వహించారు. మృతదేహాం నుంచి వైరస్ వ్యాప్తి చెందకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నారు దిల్లీ రామ్ మనోహర్ లోహియా (ఆర్ఎమ్ఎల్) వైద్యులు.
ఇప్పటివరకు భారత్‌లో వైరస్ వ్యాప్తి విస్తరిస్తోంది. కరోనా ధాటికి ఇప్పటివరకు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చూడండి: కీలక రాజ్యాంగ సవరణలపై పుతిన్ సంతకం