లాక్డౌన్ తొలి 40 రోజుల్లో మీరేం చేశారు? అంటే టీవీ, వెబ్ సిరీస్, సినిమాలతో కాలక్షేపం చేశామనే చెబుతారు చాలా మంది. కొందరైతే వంటపై ప్రయోగాలు చేశామని అంటారు. అవి కాకుండా... జీవితాంతం గుర్తుండిపోయేలా, ఉపయోగపడేలా ఏమైనా చేశారా? అంటే అతికొద్ది మంది మాత్రమే ఔనని సమాధానం ఇస్తారు. ఆ కొందరి కథే ఇది. అందరూ సామాన్యులే. కానీ... సంకల్పం, శ్రమదానమే అస్త్రాలుగా చేసుకుని పాతాళ గంగను పైకి తెచ్చారు. 'లాక్డౌన్ భగీరథులు'గా అవతరించారు.
తల్లిదండ్రుల కష్టాలు చూడలేక..
కర్ణాటకలోని బేల్తంగడి ప్రాంతం.. మితబగిలులో తల్లిదండ్రులు నీటికోసం పడే బాధలు చూడలేకపోయాడు ధనుష్ అనే తొమ్మిదో తరగతి విద్యార్థి. ఇంటి ఆవరణలో బావి తవ్వడానికి నడుం బిగించాడు. అతని సంకల్పాన్ని నెరవేర్చేందుకు మరో ఐదుగురు స్నేహితులు తోడయ్యారు.
'ధనుష్ గ్యాంగ్' కష్టపడుతుంటే 'ఆడుకుంటున్నారులే' అని భావించారు తల్లిదండ్రులు. కానీ... 4 రోజుల్లోనే 12 అడుగుల నూతిని తవ్వడం పూర్తవడం చూసి ఆశ్చర్యపోయారు. వారి బావిలో 10 అడుగుల లోతుకే మంచి నీరు వచ్చింది.
పవర్ లిఫ్టర్ బావి కథ...
అక్షతా పూజారి... కర్ణాటక ఉడుపికి చెందిన అంతర్జాతీయ స్థాయి పవర్ లిఫ్టర్. లాక్డౌన్ సమయాన్ని చక్కగా వినియోగించుకుంది ఆమె. 9 రోజులు కష్టపడి కార్కళ తాలూకా బోళ గ్రామంలోని ఇంటి దగ్గరే 25 అడుగుల బావి తవ్వింది. అలా ఫిట్నెస్ పెంచుకుంటూనే వేసవిలో నీటి కష్టాలు దూరం చేసింది అక్షత.
"కిన్నిగోలిలోని వీరమారుతి వ్యాయామశాలలో నేను నిత్యం కసరత్తులు చేస్తాను. కానీ లాక్డౌన్ కారణంగా ఆ పని చేయడం కుదరడం లేదు. అదే సమయంలో మా చుట్టాలబ్బాయి సుమిత్ ఇంటి దగ్గర ఓ వలయాన్ని గీసి, బావి తవ్వమని సవాలు విసిరాడు. నా సోదరులు అరుణ్, అశోక్‌తో కలిసి పని ప్రారంభించాను. చివరకు అనుకున్నది సాధించాను. ఇంతకుముందు మేము వేరే చోటకు వెళ్లి నీళ్లు తెచ్చుకునేందుకు 10 నిమిషాలు పట్టేది. ఇప్పుడిక ఆ బాధ లేదు."
-అక్షతా పూజారి, పవర్ లిఫ్టర్
కేరళ కుటుంబానిదీ అదే దారి
కేరళ కన్నూరు జిల్లా మత్తనూర్కు చెందిన భాస్కరన్ కుటుంబం లాక్డౌన్లో సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంది. ఇంటి పెరట్లో 11 రోజుల పాటు శ్రమించి బావి తవ్వింది. 19 అడుగులు తవ్వాక నీరు వచ్చింది. అలా వీరి కృషి ఫలించింది.
భార్యతో కలిసి...
మహారాష్ట్ర వాషిమ్ జిల్లా కర్ఖేడా గ్రామంలోనూ ఇలాంటి పని చేశారు గజానన్ పక్మోడే-పుష్ప దంపతులు. ఇటుకబట్టీలో మేస్త్రీగా పనిచేసే గజానన్ తన అనుభవాన్ని ఈ పనిలో ఉపయోగించాడు.
'మేం బావి తవ్వకాన్ని ప్రారంభించిన సమయంలో చుట్టుపక్కల వారు మమ్మల్ని నిరుత్సాహ పరిచారు. కానీ తవ్వకం ప్రారంభించిన 21వ రోజు 25 అడుగుల లోతులో నీరు వచ్చింది' అని చెప్పాడు గజానన్.
వన్యప్రాణుల దాహం తీర్చేలా..
హిమాచల్ ప్రదేశ్ పావోంటా సాహిబ్‌కు చెందిన నవయుగ్ మండల్ ఏక్తా యువతా సభ్యులు వేసవిలో వన్యప్రాణుల దాహం తీర్చారు. దట్టమైన అడవి మధ్యలో ఓ గుంత తవ్వి జంతువులు, పక్షులకు నీటిని అందుబాటులో ఉంచారు.
ఇదీ చూడండి: 'సొంత ప్రజలకన్నా పాక్‌కు ఉగ్రవాదమే ఎక్కువ'