నిర్భయ దోషి పిటిషన్‌పై తీర్పును సుప్రీంకోర్టు బుధవారానికి వాయిదా వేసింది. తన క్షమాభిక్ష అర్జీని రాష్ట్రపతి తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ దోషి ముకేశ్ శనివారం ఈ వ్యాజ్యం దాఖలు చేశాడు.
వాడివేడి వాదనలు....
జస్టిస్ ఆర్. భానుమతి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వ్యాజ్యంపై విచారణ చేపట్టిన సమయంలో వాదనలు వాడీవేడిగా సాగాయి. క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరణలో విధానపరమైన లోపాలున్నాయని ముకేశ్ తరఫు న్యాయవాది అంజనా ప్రకాశ్ ఆరోపించారు. జైలులో ముకేశ్‌ను లైంగికంగా వేధించారని తెలిపారు. ఈ ఆరోపణలను కేంద్రం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కొట్టిపారేశారు. జైలులో అతని పట్ల ప్రవర్తనను చూసి.. దారుణమైన నేరాలను పాల్పడినవారికి క్షమాభిక్ష ప్రసాదించలేరని తెలిపారు. దోషి ఆరోపిస్తున్నట్లు అతనిని ప్రత్యేక నిర్బంధంలో ఉంచలేదని స్పష్టం చేశారు.
సుప్రీం ఆగ్రహం...
క్షమాభిక్ష అభ్యర్థనపై రాష్ట్రపతి సరిగా ఆలోచించకుండా నిర్ణయం తీసుకున్నారని నిందితుడు తరఫు న్యాయవాది ఓ దశలో ఆరోపించారు. దీనిపై అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రపతిపై ఎలా ఆరోపణలు చేస్తారని నిలదీసింది.
నిర్భయ కేసుకు సంబంధించిన వాస్తవాలను క్షమాభిక్ష పిటిషన్‌తో పాటు రాష్ట్రపతి ముందు ఉంచలేదని ముకేశ్ తరఫు న్యాయవాది వాదించగా... మీరెలా చెప్పగలరని ప్రశ్నించింది ధర్మాసనం.
అయితే ఈ కేసుకు సంబంధించిన అన్ని వివరాలు రాష్ట్రపతి వద్దకు చేరాయని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. క్షమాభిక్ష తిరస్కరణలో ఎలాంటి విధానపరమైన లోపాలు లేవని స్పష్టం చేశారు.
"నిర్భయ కేసులకు సంబంధించిన అన్ని విచారణల్లో రాష్ట్రపతి పాల్గొనలేరు. క్షమాభిక్షకు సంబంధించి మాత్రమే రాష్ట్రపతి నిర్ణయం తీసుకుంటారు. కేసులో ప్రతి విషయాన్ని, విచారణ జరిగిన పద్ధతిని పరిశీలనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి కొన్ని ప్రత్యేక కేసుల్లో న్యాయసమీక్ష పరిధి చాలా పరిమితంగా ఉంటుంది."
---తుషార్ మెహతా, సొలిసిటర్ జనరల్.
క్షమాభిక్షకు సంబంధించి రాష్ట్రపతి నిర్ణయం తీసుకునేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు కేంద్ర హోంశాఖ చేసిందని మెహతా తెలిపారు. ఆలస్యంగా నిర్ణయం తీసుకుంటే ప్రతికూల ప్రభావం పడుతుందని మెహతా కోర్టుకు విన్నవించారు.
ఫిబ్రవరి 1వ తేదీన నలుగురు దోషులకు ఉరి శిక్ష అమలుకావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో దోషి ముకేశ్ పిటిషన్‌కు సంబంధించిన సర్వోన్నత న్యాయస్థానం తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఇదీ చూడండి:- బావిలో పడిన ఏనుగును రక్షించేందుకు అదిరే ఐడియా