లాక్డౌన్ కారణంగా ఎక్కడికక్కడ చిక్కుకున్న వలస కార్మికులు.. తమ స్వస్థలాలకు చేరుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. వైరస్ కట్టడిలో భాగంగా విధించిన ఆంక్షల నడుమ.. మహారాష్ట్రలో రోడ్డు మార్గం ద్వారా వెళ్తున్న కార్మికులను పోలీసులు అడ్డుకొని వెనక్కి పంపిస్తున్నారు. గత్యంతరం లేని వందలాది కూలీలు... ప్రాణాలను పణంగా పెట్టి రాత్రి వేళల్లో మురుగు కాలువల్లో నడుచుకుంటూ తమ గ్రామాలకు ప్రయాణమయ్యారు. ఈ ఘటన ఠాణెలో చోటు చేసుకుంది. వీరిలో చిన్నారులు, మహిళలూ ఉన్నారు. వీరంతా ముంబయి నుంచి నాసిక్‌కు బయలుదేరారు.

కొంతమంది స్థానికులు చూసి కూలీల దయనీయ పరిస్థితికి జాలిపడ్డారు. వారికి నీరు, ఆహారం అందించి ఆసరాగా నిలిచారు.
గత మూడురోజుల్లో వేలాది మంది వలస కార్మికుల కుటుంబాలు ముంబయి నుంచి ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్‌లోని తమ స్వగ్రామాలకు చేరుకోవాలని ఇదే తరహాలో అవస్థలు ఎదుర్కొంటూ బయలుదేరారు.
