సరిహద్దు ఉద్రిక్తతకు కారణమవుతున్న చైనాను వాణిజ్యపరంగా దెబ్బ కొట్టడంపై నరేంద్రమోదీ సర్కారు వ్యూహం సిద్ధం చేస్తోంది. టిక్‌టాక్, పబ్‌జీ సహా చైనాకు చెందిన 177 యాప్‌లను గంపగుత్తగా నిషేధించి ఆర్థికంగా ఒకసారి గట్టిదెబ్బ కొట్టిన రీతిలోనే ఇప్పుడు మొబైల్ ఫోన్ల దిగుమతులపై పాచిక ప్రయోగించాలని కసరత్తు చేస్తోంది. తద్వారా దేశీయ కంపెనీలకు పరోక్షంగా ఊతమిచ్చేందుకు వీలవుతోందని భావిస్తోంది. నిషేధించడంలో ఏమైనా ఇబ్బందులుంటే ఆంక్షల విధింపు ద్వారానైనా వాటిని కట్టడి చేయాలని ప్రభుత్వ వర్గాలు చూస్తున్నాయి.
తక్షణ వేటు, ప్రత్యామ్నాయం సాధ్యమేనా?
చైనా నుంచి దిగుమతి అవుతున్నవాటిలో సింహభాగం స్మార్ట్ ఫోన్లదే. వాటిపై ఏదోరకంగా నిషేధం విధిస్తే భారత దేశీయ కంపెనీలతో పాటు ఇతర దేశాలకు చెందిన శాంసంగ్, నోకియా వంటివాటికి గిరాకీ పెరుగుతుందని నిపుణుడు పి.ఎల్.పరాశరన్ తెలిపారు.
"చైనా యాప్‌లను నిషేధించినప్పుడు దానిని సమర్థించుకునేందుకు తగిన ప్రాతిపదిక భారత ప్రభుత్వం వద్ద ఉంది. ఆ యాప్‌లు సమాచారాన్ని వేరేవారికి చేరవేస్తున్నాయి కాబట్టి గోప్యతకు ముప్పు ఉందనే వాదనను గట్టిగా చాటగలిగాం. ఫలానా దేశం నుంచి ఉత్పత్తయ్యాయనే ఏకైక కారణంతో స్మార్ట్‌ఫోన్ల దిగుమతులపై ఆంక్షలు విధించలేం. ఇంకేదైనా బలమైన అంశాలను సమాచార సాంకేతికత (ఐటీ) చట్టం కింద ఆధారంగా చూపిస్తే ఇది సాధ్యమవుతుంది."
- పి.ఎల్.పరాశరన్
నిషేధం విధించినా అప్పటికప్పుడు పెద్దసంఖ్యలో వేరే కంపెనీల ఫోన్లను సరఫరా చేయడం ఆషామాషీ విషయమా అనే సందేహాలూ లేకపోలేదు. చైనా యాప్‌ల నిషేధం తర్వాత షియామీ వంటి స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు కొన్ని ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాయి. తమ ఫోన్లు భారత్‌లో తయారైనట్లు చెబుతూ షియామీ వెబ్‌సైట్‌లో దిగువ భాగాన పెద్ద అక్షరాల్లో ప్రదర్శించింది. భారత్‌లో తాము విక్రయించే స్మార్ట్‌ఫోన్లలో 99శాతం, టీవీల్లో 85శాతం స్థానికంగా తయారైనవేనని, తమ కర్మాగారాల్లో 30,000 మందికి పైగా భారతీయులకు ఉపాధి లభిస్తోందని పేర్కొంది.
ఇదీ చూడండి: దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన ఎయిమ్స్ నర్సులు