విదేశీ సంస్థలతో ఒప్పందాలకు సంబంధించి మన దేశం అనుసరిస్తున్న ఆఫ్సెట్ విధానంపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) పెదవి విరిచింది. ఆయా సంస్థల నుంచి అత్యాధునిక సాంకేతికతల బదిలీలో అది విఫలమవుతోందని పేర్కొంది. రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందానికి సంబంధించి కూడా ఫ్రాన్స్ సంస్థ దసో ఏవియేషన్, ఐరోపా క్షిపణుల తయారీసంస్థ ఎంబీడీఏ నుంచి ఇంకా సాంకేతికత మన దేశానికి అందలేదని తెలిపింది. ఈ మేరకు ఓ నివేదికను పార్లమెంటుకు కాగ్ బుధవారం సమర్పించింది.
దసో ఏవియేషన్ రఫేల్ యుద్ధ విమానాల తయారీ సంస్థ కాగా.. ఆ విమానాలకు క్షిపణి వ్యవస్థలను ఏంబీడీఏ సరఫరా చేసింది. భారత ఆఫ్సెట్ విధానం ప్రకారం.. మన దేశంతో ఒప్పందం కుదుర్చుకునే విదేశీ సంస్థలు, విక్రయదారులు ఆ ఒప్పందం మొత్తం విలువలో 30శాతాన్ని తప్పనిసరిగా భారత్లోనే ఖర్చు చేయాలి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్డీఐ), సాంకేతికత బదిలీ వంటి మార్గాల్లోనూ ఆ ప్రతిఫలాన్ని అందజేయవచ్చు.
అందని ప్రయోజనం
"రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీఓ)కు ఆధునిక సాంకేతికతను బదిలీచేయడం ద్వారా రూ.59వేల కోట్ల రఫేల్ ఒప్పందానికి సంబంధించిన 'ఆఫ్సెట్' బాధ్యతను నెరవేరుస్తామని దసో ఏవియేషన్, ఎంబీడీఏ హామీ ఇచ్చాయి. దీంతో తేలికపాటి యుద్ధ విమానాలకు అవసరమైన కావేరీ ఇంజిన్ను దేశీయంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని ప్రతిఫలంగా పొందాలని డీఆర్డీఓ భావించింది. అయితే.. ఇప్పటివరకూ ఆ ప్రయోజనం అందనే లేదు." అని కాగ్ తెలిపింది. ఇచ్చిన హామీని నెరవేర్చకపోయినా విదేశీ సంస్థలపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు అవసరమైన మార్గాలు మన ఆఫ్సెట్ విధానంలో లేవంటూ అసంతృప్తి వ్యక్తం చేసింది.
కాగ్ నివేదిక ఏం చెప్పిందంటే..
2005 నుంచి 2018 మార్చి మధ్య విదేశీ విక్రయదారులతో 48 ఆఫ్సెట్ కాంట్రాక్టులు కుదిరాయి. వాటి విలువ రూ.66,427 కోట్లు. అందులో రూ.19,223 కోట్ల విలువైన ప్రయోజనాలు 2018 డిసెంబర్లోగా మన దేశానికి అందాలి. కానీ.. రూ.11,396 కోట్లు మాత్రమే దక్కాయి.
- దేశంలోని మొత్తం 63 రంగాలకు గానూ.. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పొందడంలో రక్షణ రంగం 62వ స్థానంలో ఉంది.
- వాయుసేనకు చెందిన 90 'ఎంఐ-17' హెలికాప్టర్లను మెరుగుపర్చే ప్రక్రియ(అప్గ్రెడేషన్)లో తీవ్ర జాప్యం జరగడం వల్ల రక్షణ శాఖను కాగ్ విమర్శించింది. 2002లోనే ఈ అప్గ్రెడేషన్ను ప్రతిపాదించినా ఇప్పటికీ పూర్తికాకపోవడమేంటని పెదవి విరిచింది.
- సముద్ర మార్గాల్లో బలగాలు, యుద్ధ ట్యాంకులు, హెలికాప్టర్లను తరలించేందుకుగానూ 4 'ల్యాండింగ్ ప్లాట్ఫాం డాక్(ఎల్పీడీ)'లను సముపార్జించుకోవాలని 2010లోనే నిర్ణయించినా, ఇప్పటికీ నౌకాదళం వాటిని పొందలేకపోయిందంటూ కాగ్ విమర్శలు గుప్పించింది.
ఆ కేంద్రం స్థాపనతో జరిగింది శూన్యం!
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో), అంతర్జాతీయ అడ్వాన్స్డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ స్థాపించిన 'సిలికాన్ కార్బైడ్ మిర్రర్ డెవలప్మెంట్ కేంద్రం' అవసరమైన స్థాయి నాణ్యతతో కూడిన అద్దాలను ఉత్పత్తి చేయడంలో విఫలమైందని కాగ్ పేర్కొంది. ఆ కేంద్రం స్థాపన, నిర్వహణకు రూ.47.12 కోట్లు వ్యయమైన సంగతిని గుర్తు చేసింది.
ఇదీ చదవండి: ఖగోళంలో ప్రపంచ దేశాల 'ఖనిజాల వేట'!