చైనాలో ప్రారంభమై ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్ ప్రస్తుతం దేశంలో వేగంగా విస్తరిస్తోంది. ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు అదనంగా ఆస్పత్రులు, ల్యాబ్లు, ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేయాలని అన్ని రాష్ట్రాలకు సూచించింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది.
కొవిడ్-19 కట్టడిలో భాగంగా వైద్య సదుపాయాలను మెరుగుపరచాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. వెంటిలేటర్లు, వ్యక్తిగత రక్షణ పరికరాలు, మాస్కులు, చికిత్స పరికరాలతో కూడిన సదుపాయాలు కల్పించాలని కోరింది కేంద్రం. ఇప్పటికే 500 దాటిన ఈ కేసులు వ్యాప్తి చెందకుండా తగిన చర్యలు తీసుకోవడమే కాకుండా అందుకు నిధులను కేటాయించాలని సూచించింది కేంద్రం. ప్రత్యేకంగా కరోనా కేసుల కోసం ఆస్పత్రులను ఏర్పాటు చేయాలని కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ.. రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులకు లేఖ రాశారు.
జాగ్రత్తలు తప్పనిసరి
కరోనా వ్యాప్తి చెందుతున్న తరుణంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు. సైబర్ నేరగాళ్లు కరోనా వైరస్ పేరుతో మాల్వేర్లను రూపొందించి సమాచారాన్ని దొంగిలిస్తున్నారు. ఇందుకు స్పైమాక్స్, కరోనా లివ్ 1.1 పేరిట యాప్లను రూపొందించి ఫోన్లు, కంప్యూటర్ల నుంచి సమాచారాన్ని తస్కరిస్తున్నారు.
ఉత్తరాఖండ్లో..
కేవలం కరోనా బాధితుల చికిత్స కోసమే 4 వైద్య కళాశాలలను కేటాయించినట్లు వెల్లడించింది ఉత్తరాఖండ్ ప్రభుత్వం. దేహ్రాదూన్, హల్ద్వానీ, శ్రీనగర్, అల్మోరాల్లోని కళాశాలను కేటాయించామని చెప్పారు కేంద్రమంత్రి మదన్ కౌశిక్. ఉదమ్ సింగ్ నగర్, నైనిటాల్, హరిద్వార్, దేహ్రాదూన్ జిల్లాలకు రూ. 3 కోట్లు కేటాయించనున్నట్లు ప్రకటించారు. ఈ వైరస్ వ్యాప్తి కారణంగా పనులు కోల్పొయిన కార్మికులు, కూలీలకు ఆర్థిక సాయం చేసేందుకు మిగిలిన జిల్లాలకు రూ.2 కోట్లు ఇవ్వనున్నట్లు తెలిపింది అక్కడి ప్రభుత్వం.
గుజరాత్లో పరీక్షలు బంద్
గుజరాత్లో ఇప్పటికే అన్ని విద్యాసంస్థలను మూసివేసింది అక్కడి ప్రభుత్వం. 1 నుంచి 9, 11 తరగతుల వార్షిక పరీక్షలను రద్దు చేయాలని నిర్ణయించింది. పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థులనుపై తరగతులను పంపాలని అధికారులను ఆదేశించింది. 10, 12వ తరగతి పరీక్షలు ఇప్పటికే పూర్తయ్యాయి.
ఇదీ చదవండి: 'దేశదేశాలు తిరిగి సేవచేస్తుంటే అవమానిస్తారా?'