భారత్‌లో కరోనా విస్తరిస్తోంది. 24 గంటల వ్యవధిలో 1,813 మందికి వైరస్ సోకింది. కొత్తగా 71మంది ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్ర, గుజరాత్, దిల్లీ, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్‌లో వైరస్ బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంది.

ముంబయిలో ఆరువేల మందికి పైగా..
వైరస్‌తో తీవ్రంగా ప్రభావితమైన మహారాష్ట్రలో ఇప్పటివరకు 9318మంది మహమ్మారి బారినపడ్డారు. అక్కడ 400మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క ముంబయి మహానగరంలోనే కొత్తగా 393 కేసులు నమోదయ్యాయి. నగరంలో కేసుల సంఖ్య 6169కి చేరింది. ఠాణే ప్రాంతంలో 7223 మంది వైరస్ బారినపడ్డారు. పుణెలో 89మంది వైరస్‌తో మృతి చెందారు. 1288 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది.
ఇద్దరు ఖైదీలకు కరోనా
గుజరాత్ అహ్మదాబాద్‌లోని సబర్మతి కేంద్ర కారాగారంలో ఇద్దరు ఖైదీలకు కరోనా సోకింది. వారిద్దరూ ఇటీవలే జైలుకు వచ్చారు. ముందు జాగ్రత్తగా వారిని జైలు ప్రధాన ప్రాంగణానికి కాస్త దూరంగా ఉండే ఐసోలేషన్ వార్డులో ఉంచడం వల్ల ఇతరులకు సోకే ప్రమాదం తప్పింది. పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలిన అనంతరం ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు.
పంజాబ్‌లో సడలింపులు
పంజాబ్‌లో ఉదయం నాలుగు గంటల పాటు కర్ఫ్యూ సడలించాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది.
ఒడిశాలో 122మందికి..
ఒడిశాలో 122మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. కరోనా బాధితుల సంఖ్య భువనేశ్వర్‌లో 47గా ఉంది. రాష్ట్రంలో మొత్తంగా 29,108మందికి వైరస్ నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లో..
ఉత్తర్‌ప్రదేశ్‌లో నలుగురు పోలీసు సిబ్బంది వైరస్ బారినపడ్డారు. వారంతా లాక్డౌన్ ఉల్లంఘనలకు పాల్పడిన ఓ యువకుడిని పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చినవారే.
కేరళలో జర్నలిస్టుకు..
కేరళలో ఓ జర్నలిస్టు, ముగ్గురు ఆరోగ్య సిబ్బంది సహా కొత్తగా 10మందికి కరోనా సోకింది. దీంతో రాష్ట్రంలో వైరస్ బాధితుల సంఖ్య 486కు చేరింది. నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చూడండి: త్వరలో సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షలు!