దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌తో కరోనా వ్యాప్తి తగ్గుతోందని పేర్కొంది కేంద్రం. లాక్డౌన్ విధించకముందు కరోనా కేసులు రెట్టింపు అయ్యేందుకు 3 రోజులు పడితే.. ప్రస్తుతం 6.2 రోజులు పడుతోందని పేర్కొన్నారు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్.
19 రాష్ట్రాల్లో తక్కువే..
కేసుల రెట్టింపు రేటు జాతీయ సగటుతో పొలిస్తే 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో తక్కువగా ఉన్నట్లు తెలిపారు అగర్వాల్. కేరళలో ఈ రేటు అత్యల్పంగా ఉండగా.. ఆ తర్వాతి స్థానాల్లో ఉత్తరాఖండ్, హరియాణా, హిమాచల్‌ప్రదేశ్, చండీగఢ్, లద్దాఖ్, పుదుచ్చేరి, దిల్లీ, బిహార్, ఒడిశా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్, అస్సోం, త్రిపురా ఉన్నాయని వెల్లడించారు. వాక్సిన్ అభివృద్ధి చేసే పనులను వేగవంతం చేయటంపైనే దృష్టిసారించినట్లు తెలిపారు అగర్వాల్. బీసీడీ, ప్లాస్మా థెరపీ వంటి చికిత్సలను పరిశీలిస్తున్నామన్నారు.
80శాతం మంది..
దేశంలో ప్రస్తుతం నమోదైన కేసుల్లో 13.6 శాతం మంది కరోనా నుంచి కోలుకున్నట్లు తెలిపారు అగర్వాల్. కొవిడ్-19 నుంచి కోలుకున్న, మరణించిన వారి నిష్పత్తి 80:20 గా ఉన్నట్లు స్పష్టం చేశారు. అది పలు దేశాలతో పోలిస్తే అధికంగా ఉన్నట్లు తెలిపారు. మే నెల వరకు 10 లక్షల ఆర్టీపీసీఆర్ కిట్లను తయారు చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు.
437 మంది మృతి..
దేశవ్యాప్తంగా గురువారం 1,007 కొత్త కేసులు నమోదు కాగా.. 23 మంది మరణించినట్లు వెల్లడించారు అగర్వాల్. మొత్తం కేసులు 13,387కి చేరగా.. 1,749 మంది కోలుకున్నారని, మిగతా 11,201 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఇప్పటి వరకు 437 మంది మరణించారని చెప్పారు.
ఇదీ చూడండి: రోగికి సాయం కోసం బైక్‌పై 430కి.మీ ప్రయాణం