యూకేకు చెందిన టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్(టీహెచ్ఈ) అనే మ్యాగజైన్ 2020 సంవత్సరానికి గాను ప్రపంచ అత్యుత్తమ విశ్వవిద్యాలయాల జాబితాను విడుదల చేసింది. ఇందులో భారత్ వర్సిటీలు రికార్డు స్థాయిలో ర్యాంకులను దక్కించుకున్నాయి.
ఎమర్జింగ్ ఎకానమీస్ యూనివర్శిటీ ర్యాంకింగ్స్-2020లో టాప్-100లో భారత్ నుంచి 11 విశ్వవిద్యాలయాలు నిచిచాయి. ఇందులో 'ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ)' భారత్ తరఫున అత్యుత్తమంగా 16వ స్థానాన్ని దక్కించుకుంది. అమృత విశ్వ విద్యాపీఠం తొలిసారిగా టాప్-100లో చోటుదక్కించుకుంది. 2019లో 141వ స్థానంలో ఉన్న ఈ వర్సిటీ .. తాజాగా 51స్థానాలు మెరుగుపడింది. ఐఐటీ-ఖరగ్‌పూర్ 23 స్థానాలు వృద్ధి చెంది 32వ స్థానంలో నిలవగా.. ఐఐటీ-దిల్లీ 28 స్థానాలు ఎగబాకి 38వ ర్యాంక్‌ను దక్కించుకుంది. ఐఐటీ-మద్రాస్ 12 స్థానాలు మెరుగుపడి 63వ స్థానంలో నిలిచింది. ఐఐటీ-రోపర్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ వర్సిటీలు తొలిసారిగా టాప్-100లో చోటు దక్కించుకున్నాయి.
మొత్తం 47 దేశాల్లో నిర్వహించిన ఈ సర్వేలో చైనా అధికంగా 30 ర్యాంకులను కైవసం చేసుకుంది. ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని యూనివర్సిటీల స్థితిగతులపై టీహెచ్ఈ ఏటా సర్వే చేసి వాటికి ర్యాంకులను ప్రకటిస్తుంది. ఈ జాబితాలో మొత్తం ప్రపంచంలోని 533 విశ్వవిద్యాలయాలకు ర్యాంకింగ్స్ ఇవ్వగా.. భారత్‌లోని 56 యూనివర్శిటీలకు స్థానం దక్కింది.
ర్యాంకులు ఇలా ఇస్తారు..
విదేశీ విద్యార్థులు, ఉద్యోగుల పెరుగుదల, ఆన్లైన్ కోర్సులను అందించడం, ఇతర విశ్వవిద్యాలయాలకు విద్యా సహకారాన్నందించడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ర్యాంకులను నిర్ణయిస్తారు.
'ప్రపంచ ర్యాంకింగ్స్‌లో భారతీయ విశ్వవిద్యాలయాలు సాధించిన విజయాలపై చాలాకాలంగా చర్చలు జరుగుతున్నాయి. ఎమర్జింగ్ ఎకానమీస్ యూనివర్శిటీ ర్యాంకింగ్స్-2020లో పరిగణనలోకి తీసుకున్న అంశాల ప్రకారం.. అనేక సంస్థలు వాస్తవమైన అభివృద్ధిని సాధించాయి. ఇది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ పథకం ద్వారా మాత్రమే సాధ్యమైంది.'
- ఫిల్ బాటీ, టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ప్రతినిధి
లాభాలేంటి.?
ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ పథకంలో పాల్గొనే విశ్వవిద్యాలయాలకు టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ఇచ్చే ర్యాంకింగ్స్‌ను బట్టి యూజీసీ నుంచి నిధులు సమకూరుతాయి. అధిక స్వయం ప్రతిపత్తి కూడా లభిస్తుంది.
2014లో ర్యాంకింగ్స్ ప్రారంభం కాగా.. 11 భారతీయ సంస్థలకు టాప్-100లో చోటుదక్కడం ఇది రెండోసారి. అయితే... ప్రపంచవ్యాప్తంగా ఈసారి చాలా తక్కువ విశ్వవిద్యాలయాలు ఇందులో పాల్గొన్నాయి.
ఇదీ చదవండి: పురుషాధిక్యతకు చెక్.. సైన్యంలో సమన్యాయం