పౌర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సోమవారం ఉదయం దిల్లీ ఎయిర్‌పోర్ట్‌ను ఆకస్మికంగా సందర్శించారు. దిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో తీవ్ర జాప్యం సమస్యపై ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆయన ఎయిర్పోర్ట్కు స్వయంగా వెళ్లారు. సమస్య తీవ్రంగా ఉన్న మూడో టర్మినల్‌లో సీనియర్ అధికారులతో కలిసి పరిస్థితులను పరిశీలించారు. రద్దీగా ఉన్న ప్రాంతాలను తనిఖీ చేశారు. ఈ క్రమంలోనే విమానాశ్రయ సిబ్బందితో మాట్లాడి వారికి పలు సూచనలు చేశారు. రద్దీని నివారించేందుకు వీలైనంతవరకు కృషి చేయాలని సూచించారు.
"ఎయిర్‌పోర్ట్ రద్దీ సహా భద్రత విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నాం. ప్రస్తుతం దిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో 13 ప్రవేశద్వారాలు ఉన్నాయి. వాటిని 16కు పెంచాం. మరో నాలుగు లైన్లను ఏర్పాటు చేసి 20కి చేర్చాలని అనుకుంటున్నాం. ప్రతి ప్రవేశ ద్వారం వద్ద వెయిటింగ్ లిస్ట్ బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఎంతమంది లైన్లో ఉన్నారనేది ముందే తెలుసుకోవచ్చు. ఏ గేట్ వద్ద తక్కువ సమయం పడుతుందో ప్రయాణికులకు తెలిసిపోతుంది. దీని వల్ల సమస్య తగ్గుతుంది."
-జ్యోతిరాదిత్య సింధియా, కేంద్ర మంత్రి
దిల్లీ విమానాశ్రయంలో కొన్నాళ్లుగా తీవ్రమైన రద్దీ నెలకొంది. టెర్మినల్ సెక్యూరిటీ, ఇమ్మిగ్రేషన్ లైన్లలో జాప్యం జరుగుతోంది. ప్రయాణికులు అన్ని రకాల చెకింగ్‌లు పూర్తిచేసుకొని విమానం ఎక్కడానికి కొన్ని గంటల సమయం పడుతోంది. దిల్లీ ఎయిర్ పోర్టులో విస్తరణ పనులు జరుగుతుండటం వల్ల ప్రయాణికులను మూడో టర్మినల్ వైపు మళ్లించడం కూడా సమస్యకు కారణమవుతోంది. ఆదివారం సైతం ఎయిర్‌పోర్ట్ కిక్కిరిసిపోయింది. దీంతో చాలా మంది ప్రయాణికులు తమ అవస్థలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు ట్యాగ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన సోమవారం విమానాశ్రయాన్ని సందర్శించారు.