An Association From Tamilnadu on Chandrababu Arrest: చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే దేశంలోని వివిధ రాష్ట్రాల నేతలు చంద్రబాబు అరెస్టును ఖండించారు. అంతే కాకుండా వివిధ దేశాలలో సైతం బాబు అరెస్టును వ్యతిరేకిస్తూ నిరసనలు చేపట్టి.. తమ మద్దతు తెలియజేశారు. చంద్రబాబు అరెస్టై చాలా రోజులు గడుస్తున్నా విడుదల కాకపోవడంపై నిరసనలు వెల్లువెత్తున్నాయి. తమ అభిమాన నేత అరెస్టును తట్టుకోలేక పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయి.
తాజాగా తమిళనాడులోని మామన్నార్ తిరుమలై నాయకర్ అనే అసోసియేషన్ చంద్రబాబు నాయుడు అరెస్టుపై స్పందించింది. చంద్రబాబు నాయుడుని విడుదల చేయకుంటే.. నిరసనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అద్భుతమైన పరిపాలన అందించిన చంద్రబాబును రాజకీయ కక్షలతో అరెస్టు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.
చెన్నైలో మామన్నార్ తిరుమలై నాయకర్ అసోసియేషన్ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అయ్యలు సామి నాయుడు, కంపెనీ అధ్యక్షుడు సుబ్బయ్యనాయుడు, కోశాధికారి పద్మనాబన్ నాయుడు, నిరసన కమిటీ నాయకులు బాలకృష్ణనాయుడు, నల్లయ్యనాయుడు, రామమూర్తినాయుడు, సమన్వయకర్త జయరామన్ లు హజరైయ్యారు. అద్భుతమైన పరిపాలనా దక్షత కలిగిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. హైదరాబాద్‌ను ఎంతగానో అభివృద్ధి చేశారని అసోసియేషన్ సభ్యులు కొనియాడారు. ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో నడిపిన వ్యక్తి చంద్రబాబు నాయుడును నేడు అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రకటించారు.
దేశంలోనే ఉత్తమ ప్రాజెక్టులను ప్రారంభించారు: చంద్రబాబు నాయుడు ప్రారంభించిన పోలవరం ప్రాజెక్ట్, పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్‌లో పూర్తయితే.. రాయలసీమ ప్రాంతంతో పాటు తమిళనాడులోని పలు జిల్లాలు నీటి వనరులతో సమృద్ధిగా ఉండేవని తెలిపారు. కానీ నేడు రాజకీయ కక్షలతో ప్రాజెక్టులను అసంపూర్తిగా వదిలేయడమే కాకుండా.. దేశంలోనే ఉత్తమ ప్రాజెక్టులను ప్రారంభించిన చంద్రబాబు నాయుడును అరెస్టు చేసి జైలులో పెట్టడం దురదృష్టకరమన్నారు. చంద్రబాబు నాయుడు 36 బ్యారేజీలు నిర్మించి వ్యవసాయాన్ని సుభిక్షం చేశారన్నారని పేర్కొన్నారు.
లక్షలాది యువతకు ఉపాధి కల్పించిన దార్శనికుడు : రాజకీయ ప్రతీకారంతో చంద్రబాబు నాయుడును అరెస్టు చేయడం దారుణమని మామన్నార్ తిరుమలై నాయకర్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది. స్కిల్ డెవలప్‌మెంట్ సంస్థ ద్వారా విద్యార్థులకు శిక్షణను అందించి లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించిన ఘనత చంద్రబాబుది అని చెప్పారు. ఈ సంస్థ ద్వారా యువతలో చంద్రబాబుకు మంచి పేరు వచ్చిందన్నారు. ఇవన్నీ తట్టుకోలేకే రాజకీయ కక్షతో, ఉద్దేశపూర్వకంగా చంద్రబాబును అరెస్ట్ చేశారన్నారు. చంద్రబాబు నాయుడును విడుదల చేయకుంటే చెన్నైలో ధర్నా చేస్తామని హెచ్చరించారు.