పింఛన్ సొమ్ము కాజేసిన గ్రామ వాలంటీర్ - నిలదీస్తే పొంతన లేని సమాధానాలు
🎬 Watch Now: Feature Video
Village Volunteer Stolen Pension Money in Kuderu: పింఛన్ సొమ్మును వాలంటీరు కాజేసిన ఘటన అనంతపురం జిల్లా కూడేరులో చోటు చేసుకుంది. కూడేరు సచివాలయం 2లో పని చేస్తున్న భీమలింగయ్య అనే గ్రామ వాలంటీరు 8 మంది లబ్ధిదారులతో రెండు రోజుల క్రితమే పింఛన్ ఇచ్చినట్లు బయోమెట్రిక్ వేయించుకున్నాడు. వారు డబ్బులు అడిగితే ఆన్లైన్ పని చేయలేదని, తీసుకు వచ్చి ఇస్తానని చెప్పి వెళ్లిపోయాడు. లబ్ధిదారులు పింఛన్ ఇవ్వాలని అడుగుతుంటే పొంతనలేని సమాధానాలు చెప్తూ వచ్చాడు. వారికి సంబంధించిన 24 వేల రూపాయలను కాజేసిన వాలంటీర్, వాటిని ఈనెల 20లోగా లబ్ధిదారులకు చెల్లిస్తానని మాయ మాటలు చెప్పాడు.
అతని మాటలు నమ్మలేక పింఛనుదారులు కూడేరు మండల పరిషత్ అధికారులకు ఫిర్యాదు చేశారు. తమకు పింఛన్ ఇప్పించాలని వారిని కోరారు. అయితే అక్కడ అధికారులు కూడా పట్టించుకోలేదని బాధితులు తెలిపారు. దీనిపై అధికారులు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడం గానీ, అతని నుంచి పింఛన్ సొమ్మును లబ్ధిదారులకు ఇప్పించడం గానీ చేయకుండా పంచాయతీలోని కొంత మంది పెద్ద మనుషుల దృష్టికి తీసుకుపోయారు. దీంతో బాధితులు ఈ విషయాన్ని ఎంపీడీఓ దృష్టికి తీసుకుపోగా, ఘటన గురించి తమ దృష్టికి వచ్చిందని, రాత పూర్వకమైన ఫిర్యాదు ఇవ్వాలని సూచించారు. అనంతరం ఫిర్యాదుపై విచారించి తగిన చర్యలు తీసుకుంటామని ఎంపీడీఓ తెలిపారు.