తెలంగాణ చిహ్నం మార్పు నిర్ణయంలో ఆంధ్రా వ్యక్తుల ప్రభావం : వినోద్ కుమార్
🎬 Watch Now: Feature Video
Telangana State Symbol Change Issue : తెలంగాణ రాష్ట్ర అధికార చిహ్నంలో మార్పులు చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం సరైంది కాదని బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. కాకతీయ తోరణం, చార్మినార్‌కు మించిన ప్రత్యామ్నాయం వేరేది ఏదైనా ఉందా అని ప్రశ్నించారు. రాష్ట్ర చిహ్నం మార్పు నిర్ణయంపై బీఆర్ఎస్ భవన్లో వినోద్ కుమార్ ప్రెస్‌మీట్ నిర్వహించారు. వెనుకబడిన తరగతుల నుంచి వచ్చిన కాకతీయ రాజులు, ఓరుగల్లు కేంద్రంగా తెలుగు రాష్ట్రాల్ని అద్భుతంగా పాలించారని అన్నారు. చార్మినార్ అంటే హైదరాబాద్, హైదరాబాద్ అంటే చార్మినార్ అని అలాంటి చిహ్నాన్ని మారుస్తాననడం సబబు కాదని పేర్కొన్నారు.
BRS Vinod Kumar On Telangana State Symbol : రేవంత్ రెడ్డిని ఆంధ్రా వ్యక్తులు ప్రభావితం చేస్తున్నారని వినోద్ కుమార్ ఆరోపించారు. ముఖ్యమంత్రిగా అందరి మాటలు వింటూనే, విస్తృతమైన ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. గొలుసు కట్టు చెరువులు కాకతీయుల దూరదృష్టికి నిదర్శనం అని కొనియాడారు. వ్యవసాయానికి పెద్ద పీట వేసి, సామాన్యుల అభివృద్ధి కోసం పనిచేసిన రాజుల చరిత్రను తెలంగాణ ప్రజలకు దూరం చేసే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. ఇదంతా ప్రజలు గమనించాలని కోరారు. కేబినెట్ సమావేశంలో అధికార చిహ్నం మార్పు గురించి ప్రస్తావన వచ్చినప్పుడు వరంగల్‌కు చెందిన మంత్రులు కొండా సురేఖ, సీతక్కతో పాటు మిగతా మంత్రులందరూ నిరాకరించాలని విన్నవించారు. ఒకవేళ కోరికను మన్నించకుంటే తెలంగాణ ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.