కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇంటి ముట్టడికి విద్యార్థి సంఘాల యత్నం - కాచిగూడలో ఉద్రిక్తత - Students Union Leaders Protest
🎬 Watch Now: Feature Video
Students Union Leaders Protest : నీట్ పరీక్ష రద్దు చేయాలంటూ హైదరాబాద్ కాచిగూడలోని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఇంటి ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆధ్వర్యంలో కేంద్రమంత్రి ఇంటిని విద్యార్థి సంఘాల నేతలు ముట్టడించారు. జాతీయ స్థాయి వైద్య విద్య ప్రవేశ పరీక్షలో అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ నీట్ ఛైర్మన్ రాజీనామా చేయాలంటూ నిరసనకారులు నినాదాలు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళన చేస్తున్న బల్మూరి వెంకట్ సహా విద్యార్థి సంఘాల నాయకులను నల్లకుంట ఠాణాకు తరలించారు.
ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నీట్ పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించి విద్యార్థులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తెలిపారు. నీట్ సమస్యపై విన్నవించేందుకు కిషన్‌రెడ్డి అపాయింట్మెంట్ కోరగా, ఇవ్వకపోవడంతోనే ఐక్య యువజన, విద్యార్థి సంఘాల నాయకులంతా కలిసి ఆయన ఇంటిని ముట్టడించి నిరసన తెలిపే ప్రయత్నం చేశామని వివరించారు.