'మా పంటలకు సాగునీరు అందించండి మహాప్రభో'- మంథనిలో రైతుల ఆందోళన - Farmers Dharna In Peddapalli
🎬 Watch Now: Feature Video


Published : Mar 14, 2024, 5:40 PM IST
Farmers Dharna In Peddapalli District : పెద్దపల్లి జిల్లాలో పంట పొలాలకు సాగునీరు అందించాలని రైతులు మంథని ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. పొట్ట దశలో ఉన్న పొలాలు సాగునీరు రాక ఎండిపోతున్నాయని వారం క్రితం ధర్నా చేయగా, రెండు రోజులో సాగునీరు అందిస్తామని ఆర్డీవో హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. హామీ ఇచ్చి వారం రోజులు గడుస్తున్నా సాగునీరు అందకపోవడంతో, ఇవాళ మరోసారి ధర్నాకు దిగారు.
నెల రోజులుగా తమ వ్యవసాయ పంట పొలాలకు ఒక్కసారి కూడా సాగునీరు అందించలేదని, చేతికి వచ్చిన వరి పంటలు ఎండిపోతున్నాయని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఏకధాటిగా పది రోజులు సాగునీరు అందించాలని రైతన్నలు కోరుతున్నారు. జిల్లా పాలనాధికారి వచ్చి హామీ ఇస్తేనే ధర్నా విరమింప చేస్తామని, రైతులు మండుటెండను సైతం లెక్కచేయకుండా, గత మూడు గంటలుగా రహదారిపై అడ్డంగా బైఠాయించారు. మంథని ఆర్డీవో హనుమాన్ నాయక్, తహశీల్దార్, పోలీసులు రైతుల వద్దకు వచ్చి హామీ నెరవేరుస్తామని ఎంత వివరించి చెప్పినా రైతులు మాత్రం సాగునీరు ఇచ్చే అంతవరకు ధర్నా విరమించేది లేదని అన్నదాతలు ఆక్రోశం వెళ్లగక్కారు. రైతులు ఎంత చెప్పినా వినకపోవడంతో తహశీల్దార్, ఆర్డీవో వెనుతిరిగి వెళ్లిపోయారు. రైతులు రోడ్డుపైనే కూర్చొని ధర్నా కొనసాగిస్తున్నారు. ధర్నాతో రోడ్డుకు ఇరువైపులా కిలోమీటర్ల కొద్దీ వాహనాలు భారీగా నిలిచిపోయాయి. వాహనాల్లో, బస్సుల్లో ఇరుక్కుపోయిన ప్రయాణికులు ఎండవేడికి తట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.