ఎన్నికల డిపాజిట్ కింద రూ.12,500 చిల్లర- లెక్కించేందుకు తీవ్రంగా శ్రమించిన సిబ్బంది! - Nomination With Coins - NOMINATION WITH COINS
🎬 Watch Now: Feature Video
Published : Apr 3, 2024, 11:41 AM IST
Election Nomination With Coins : మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లాలో లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగిన ఓ స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసిన సమయంలో ఏకంగా రూ.12,500 విలువ చేసే చిల్లర నాణేలను ఎన్నికల అధికారికి సమర్పించారు.
యవత్మాల్-వాషిం లోక్‌సభ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా మనోజ్ గెడం పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ దాఖలు చేసేందుకు మంగళవారం తన మద్దతుదారులతో కలిసి జిల్లా ఎన్నికల కార్యాలయానికి వచ్చారు. ఈ క్రమంలో డిపాజిట్ కింద చెల్లించాల్సిన రూ.12,500 మొత్తాన్ని చెక్ లేదా కరెన్సీ నోట్ల రూపంలో కాకుండా కాయిన్స్ రూపంలో చెల్లించారు.
రూ.1, 2, 5, 10 రూపాయల నాణేలను పెద్ద సంచిలో తీసుకొని వచ్చారు మనోజ్. అయితే ఇంత భారీ మొత్తంలో వచ్చిన కాయిన్స్‌ను లెక్కించేందుకు కార్యాలయ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. వారికి సాయంగా అభ్యర్థి మనోజ్ గెడంతో పాటు ఆయన కార్యకర్తలు కూడా నాణేలను లెక్కించారు. అలా లెక్కించిన వాటిని చిన్న ప్లాస్టిక్ సంచుల్లో నింపి సంబంధిత ఎన్నికల అధికారికి డిపాజిట్‌గా అందజేశారు.
సామాజిక కార్యకర్తగా ప్రసిద్ధి చెందిన మనోజ్ గెడంను స్థానికంగా గురుదేవ్ అని పిలుస్తారు. ఇక కొన్నేళ్లుగా ప్రజలకు సేవచేస్తూ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను ఈ లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు ఎలాగైనా గెలిపిస్తారని మనోజ్ విశ్వాసం వ్యక్తం చేశారు.