కేసీఆర్ విద్యుత్ వ్యవస్థను అల్లకల్లోలం చేసి - ఇప్పుడు చిలక పలుకులు పలుకుతున్నారు : భట్టి - DY CM Batti Vikramarka Fires On KCR - DY CM BATTI VIKRAMARKA FIRES ON KCR
🎬 Watch Now: Feature Video
Published : Apr 14, 2024, 3:58 PM IST
Ambedkar Jayanthi Celebrations 2024 : రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్.అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరయ్యారు. అంబేడ్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. అనంతరం భట్టి మాట్లాడారు.
బాబాసాహెబ్ బి.ఆర్.అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రంలో పేద, మధ్య తరగతి ప్రజలు ఆత్మ గౌరవంతో తలెత్తుకుని జీవించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగిస్తోందని భట్టి విక్రమార్క అన్నారు. గొప్పగా ఇందిరమ్మ పాలనను తాము అందిస్తుంటే, పదేళ్ల కాలంలో నియంతృత్వంగా భావ ప్రకటన స్వేఛ్ఛ లేకుండా పాలించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్థాయి మరచి, దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని రూ.7 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చారన్న భట్టి, ఎకరం భూమికి నీరు ఇవ్వని కాళేశ్వరానికి ఏడాదికి రూ.10 వేల కోట్ల విద్యుత్ బిల్లులు కట్టేలా చేశారని విమర్శించారు. యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్రాజెక్టులను టెండర్లు పిలవకుండా తనకు నచ్చిన వారికి, కమీషన్లు ఇచ్చిన వారికి కట్టబెట్టారని ఆరోపించారు. యాదాద్రిపైన రూ.35 వేల కోట్ల ప్రజాధనం వెచ్చించారని, అది భవిష్యత్తులో తెలంగాణ ప్రజానీకానికి గుదిబండగా మారుతుందన్నారు. విద్యుత్ వ్యవస్థను అల్లకల్లోలం చేసి, ఇప్పుడు చిలక పలుకులు పలుకుతున్నారని అన్నారు.