నృత్య ప్రదర్శన అర్ధాంతరంగా నిలిపివేత - హైదరాబాద్ బుక్ ఫెయిర్లో ఘర్షణ - Clash at Hyderabad Book Fair 2024
🎬 Watch Now: Feature Video
Published : Feb 15, 2024, 11:20 AM IST
Clash at Hyderabad Book Fair 2024 : హైదరాబాద్‌లోని దోమలగూడ ఎన్టీఆర్ స్టేడియంలో 36వ జాతీయ పుస్తక ప్రదర్శన కొనసాగుతోంది. ఈ క్రమంలోనే బుధవారం శ్రీ గురు నృత్యాలయ అకాడమీకి చెందిన చిన్నారుల శాస్త్రీయ నృత్య ప్రదర్శనకు రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ అనుమతి ఇచ్చింది. దీంతో తమ పిల్లలను తీసుకొని చిన్నారుల తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కార్యక్రమానికి హాజరయ్యారు. నృత్య ప్రదర్శన సాగుతున్న సమయంలో నిర్వాహకులు అర్ధాంతరంగా ఈ ప్రదర్శనను నిలిపివేశారు.
దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన చిన్నారుల తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు పుస్తక ప్రదర్శన నిర్వాహకుల తీరును తప్పుబట్టారు. గంట తర్వాత నృత్య ప్రదర్శనకు సమయం ఇస్తామని వారు చెప్పారని, ఇప్పుడు అడిగితే స్పందించడం లేదని వాపోయారు. ఈ క్రమంలోనే నిర్వాహకులతో వారు వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలోనే పుస్తక ప్రదర్శన అధ్యక్షుడు జూలూరీ గౌరీ శంకర్ వేదికపై నుంచి చిన్నారుల తల్లిదండ్రులు, కుటుంబసభ్యులపై అసహనం వ్యక్తం చేశారు. దీంతో పుస్తక ప్రదర్శనలో కొద్దిసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. అనంతరం గొడవ సద్దుమణిగింది.