రాష్ట్రాలు రెండుగా మారినా - తెలుగు ప్రజలంతా ఒక్కటే : చంద్రబాబు - Chandrababu tweet - CHANDRABABU TWEET
🎬 Watch Now: Feature Video
Published : Jun 2, 2024, 9:16 PM IST
Chandrababu tweet on State Bifurcation : పేదరికం లేని సమాజం దిశగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రయాణం సాగాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆకాక్షించారు. రెండు రాష్ట్రాలు ఏర్పడి 10 ఏళ్లు అయిన సందర్భంగా తెలుగు ప్రజల విజయాలు, కీర్తి ప్రపంచవ్యాప్తం కావాలన్నారు. రానున్న రోజుల్లో ఆర్థిక అసమానతలను నిర్మూలించి, సమగ్ర సాధికారత సాధించే దిశగా కొనసాగాలని పిలుపునిచ్చారు. 10 కోట్ల తెలుగు జాతి మేటిగా వెలగాలన్నదే తన ఆకాంక్ష అని చంద్రబాబు స్పష్టంచేశారు. రెండు రాష్ట్రాలు ఏర్పడి నేటికి 10 ఏళ్లు అని, రాష్ట్రాలు రెండైనా తెలుగు ప్రజలంతా ఒక్కటేనని తెలిపారు. నాటి ఆర్థిక సంస్కరణల తరువాత సంపద సృష్టికి బీజం పడిందని, ప్రభుత్వ విధానాల ద్వారా సంక్షేమం, అభివృద్ధితో ప్రజల జీవితాల్లో మార్పులు మొదలయ్యాయని గుర్తుచేసుకున్నారు. నాలెడ్జ్ ఎకానమీతో అవకాశాలను అందిపుచ్చుకుని భారతీయులు, ముఖ్యంగా తెలుగు ప్రజలు అద్భుత ఫలితాలు సాధిస్తున్నారని సంతోషం వ్యక్తంచేశారు. భారతదేశం స్వాతంత్ర్యం సాధించి 100 ఏళ్లు పూర్తి అయ్యే 2047 నాటికి ప్రపంచంలో భారతీయులు అంతా అగ్రస్థానంలో ఉండాలని, అందులో తెలుగు జాతి నెంబర్ 1 అవ్వాలని ఆకాంక్షించారు.