How To Use Smart Phone As A TV Remote : టీవీ రిమోట్‌ను ఎక్కడో పెట్టి మర్చిపోయి, దానికోసం తెగ వెతికేయడం కామన్‌గా అందరి ఇళ్లల్లో జరుగుతుంటుంది. ఒక్కోసారి టీవీ రిమోట్ సోఫాలు, మంచం కింద ఉండిపోయి కనిపించదు. సమయానికి రిమోట్ దొరకకపోవడం వల్ల టీవీలో మనకు కావాల్సిన ఛానల్ మార్చలేం. ఆలాగే సౌండ్‌ను పెంచడం, తగ్గించడం కూడా కుదరదు. రిమోట్ దొరికేంతవరకు టీవీని ఉపయోగించలేం. రిమోట్ పాడైనప్పుడు కూడా ఇదే పరిస్థితి. ఇలాంటి సందర్భాల్లో చాలా చికాకు పుడుతుంది. అయితే ఇలాంటి సమయాల్లో మీ స్మార్ట్‌ఫోన్‌నే రిమోట్‌గా మార్చి స్మార్ట్‌టీవీని కంట్రోల్ చేయవచ్చు. టీవీ వాల్యూమ్‌ను పెంచొచ్చు, తగ్గించొచ్చు. ఛానల్స్‌ను సైతం స్మార్ట్‌ఫోన్ ద్వారా మార్చుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
How To Use Google TV App :
- ముందుగా మీ స్మార్ట్‌ఫోన్, స్మార్ట్ టీవీ రెండింటికీ బ్లూటూత్ లేదా వైఫైను కనెక్ట్ చేయండి.
- ఆ తర్వాత మీ ఫోన్లో గూగుల్ ప్లేస్టోర్ ఓపెన్ చేసి, 'గూగుల్ టీవీ యాప్'ను డౌన్లోడ్ చేసుకోండి.
- తరువాత గూగుల్ టీవీ యాప్‌ను ఇన్స్టాల్ చేసి, ఓపెన్ చేయండి.
- స్క్రీన్ కింద వైపు రైట్ కార్నర్లో ఉన్న 'రిమోట్ బటన్'పై క్లిక్ చేయండి.
- వెంటనే యాప్ సమీపంలోని డివైజ్‌లను కనెక్ట్ చేయడానికి స్కాన్ చేయడం ప్రారంభిస్తుంది.
- లిస్ట్‌లో మీ టీవీ పేరు కనిపించగానే, దానిని సెలెక్ట్ చేయండి.
- అప్పుడు మీ టీవీ స్క్రీన్‌పై ఓ కోడ్ కనిపిస్తుంది.
- ఆ కోడ్‌ను మీ స్మార్ట్‌ఫోన్‌లోని యాప్‌లో ఎంటర్ చేసి, పెయిర్ బటన్‌ను నొక్కండి.
- మీ స్మార్ట్టీవీతో, స్మార్ట్‌ఫోన్ పెయిర్ అవుతుంది. అంతే సింపుల్!
- ఇకపై మీ స్మార్ట్‌ఫోన్ ఒక రిమోట్‌లాగా వాడుకోవచ్చు.
మీ స్మార్ట్‌ఫోన్‌తో టీవీ వాల్యూమ్ తగ్గించడం, పెంచడం, మ్యూట్ చేయడం, ఛానల్స్ మార్చడం, పాస్వర్డ్లు ఎంటర్ చేయడం, వాయిస్ సెర్చ్, నావిగేషన్ లాంటి అన్ని పనులు చేయవచ్చు.
How To Use TV Remote Apps
ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ను టీవీ రిమోట్‌గా మార్చే అనేక యాప్స్ అందుబాటులోకి వచ్చేశాయి. వాటిలో (AnyMote Smart IR Remote) ఎనీమోట్ స్మార్ట్ యూనివర్సల్ రిమోట్ యాప్ ఒకటి. దీనిని కూడా గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని వాడుకోవచ్చు. ఇప్పుడు చాలా కంపెనీలు సొంతంగా రిమోట్ యాప్‌లను తయారు చేస్తున్నాయి. వాటిని కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ మీరు అమెజాన్ ఫైర్‌స్టిక్, గూగుల్ క్రోమ్‌కాస్ట్ ఆల్ట్రా లాంటి స్ట్రీమింగ్ డివైజ్‌లను ఉపయోగిస్తూ ఉంటే, వాటిని కూడా స్మార్ట్ఫోన్లకు కనెక్ట్ చేసుకోవచ్చు.
వాట్సాప్ నయా కాలింగ్ ఫీచర్ - నంబర్ లేకున్నా ఫోన్ చేయొచ్చు! - WhatsApp In App Dialer