Earth Temporary Second Moon 2024 PT5: మన రెండో చందమామ భూమికి గుడ్ బై చెప్పే సమయం దగ్గర పడింది. మరి కొన్ని రోజుల్లో ఈ మినీ మూన్ మనల్ని వదిలి వెళ్లిపోనుంది. అసలు ఆకాశంలో ఇద్దరు చందమామలు ఉన్నారని మీకు తెలుసా? మనం రోజూ ఒకే చంద్రుడిని చూస్తున్నాం కదా? మరి ఈ మినీ మూన్ ఏంటి? అని అనుకుంటున్నారా? అయితే మీకోసమే ఈ సమాచారం.
ఆకాశంలో ఇటీవలే ఓ అద్భుతం సాక్షాత్కారమైంది. మన భూమికి ఉన్న చంద్రుడికి తోడు మరో మూన్ వచ్చి చేరాడు. నాసాకు చెందిన అట్లాస్ (ఆస్టరాయిడ్ టెరెస్ట్రియల్-ఇంపాక్ట్ లాస్ట్ అలర్ట్ సిస్టమ్) పరికరం ద్వారా ఇటీవలే ఆగస్టు 7న శాస్త్రవేత్తలు దీన్ని గుర్తించారు. ఇది 10 మీటర్ల లేదా 33 అడుగుల వ్యాసంతో ఉండే గ్రహశకలం. సూర్యుని చుట్టూ పరిభ్రమించే '2024 PT5' అనే ఈ గ్రహశకలం భూమి గురుత్వాకర్షణ పరిధిలోకి రావడంతో అది మినీ చంద్రుడిగా మారిపోయింది.
సూర్యుడు, భూమి గురుత్వాకర్షణ శక్తి సంయుక్త ప్రభావంతో ఈ అద్భుతం సాక్షాత్కారం అయింది. సూర్యుని చుట్టూ పరిభ్రమించే ఈ గ్రహశకలం కొన్నేళ్లుగా భూమికి దగ్గరగా జరుగుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. సూర్యుడి గురుత్వాకర్షణ ప్రభావంలో ఉన్న ఈ ఆస్ట్రాయిడ్ మెల్లగా భూమి గురుత్వాకర్షణ పరిధిలోకి వచ్చి చేరింది. ఈ గ్రహశకలం భూమిని ఢీకొట్టే అవకాశం లేదని సైంటిస్టులు చెబుతున్నారు. ఇది కొంతకాలం భూమి చుట్టూ సంక్లిష్ట మార్గంలో తిరుగుతూ తిరిగి సౌర వ్యవస్థలోకి వెళ్లిపోనుందని వెల్లడించారు.
సెప్టెంబర్ 29 నుంచి నవంబరు 25 వరకూ ఈ మినీ మూన్ భూమి చుట్టూ తిరుగుతుందని తెలిపారు. అయితే 3474.8 కిలోమీటర్ల వ్యాసం కలిగిన మన చంద్రుడి కంటే పరిమాణంలో 3లక్షల 50వేల రెట్లు చిన్నదిగా ఉండే ఈ గ్రహశకలాన్ని నేరుగా చూడలేమన్నారు. కనీసం 30 అంగుళాల వ్యాసం కలిగిన టెలిస్కోప్‌ను ఉపయోగిస్తే కానీ అది కనిపించదని తెలిపారు.
సాధారణంగా భూమి తనకు సమీపంలో ఉండే గ్రహశకలాలను తన కక్ష్యలోనికి లాక్కుంటుంది. ఇవి కొన్నిసార్లు భూమి చుట్టూ ఒకటి లేదా అంతకంటే ఎక్కువసార్లు తిరిగి కక్ష్యను పూర్తి చేసేముందు భూమి దీర్ఘవృత్తాకార మార్గం నుంచి విడిపోతాయి. ఇలా భూమి పైకి మినీ మూన్స్ రావటం ఇదేం మొదటిసారి కాదని, ఇంతకు ముందుకు కూడా 1997, 2013, 2018 సంవత్సరాల్లో కూడా వచ్చాయని శాస్త్రవేత్తలు గుర్తు చేస్తున్నారు. ఈ మినీ మూన్‌లు విలువైన ఇన్సైట్స్, భూమికి పొటెన్షియల్ ఆస్ట్రాయిడ్ థ్రెడ్స్‌ను ట్రాక్ చేసేందుకు టెక్నాలజీని మెరుగుపర్చడంలో శాస్త్రవేత్తలకు ఉపయోగపడతాయని ఖగోళ శాస్త్ర నిపుణుడు విలియం బ్లాక్‌మోర్ తెలిపారు.