Android 15 Update: ఆండ్రాయిడ్ అప్‌డేట్ కోసం ఎదురుచూస్తున్న వారికి గూగుల్ గుడ్‌న్యూస్ చెప్పింది. పిక్సెల్ ఫోన్లలో Android 15 స్టేబుల్ వెర్షన్‌ను రిలీజ్ చేసింది. కొత్త పిక్సెల్ 9 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లతో సహా ఎంపిక చేసిన పిక్సెల్ మొబైల్స్‌లో ఇప్పుడు ఆండ్రాయిడ్ 15 అప్‌డేట్ అందుబాటులోకి వస్తోంది. ఆండ్రాయిడ్ 15తో పాటు అక్టోబర్ పిక్సెల్ డ్రాప్‌లో భాగంగా పిక్సెల్స్‌కు వచ్చే కొత్త ఫీచర్ల జాబితాను కూడా గూగుల్ ప్రకటించింది. యూజర్స్ గోప్యత, మల్టీ టాస్కింగ్ సామర్థ్యాలను పెంచే లక్ష్యంతో గూగుల్ వీటిని తీసుకొచ్చింది.
Android 15లో కీలక మార్పులు ఇవే: ఆండ్రాయిడ్ 15తో పిక్సెల్ మొబైల్స్‌లో వస్తున్న కొన్ని కీలక మార్పులను గూగుల్ వివరించింది. వీటిలో డిజైన్ మార్పులు, థెఫ్ట్ డిటెక్షన్ లాక్, ప్రైవేట్ స్పేస్‌తో పాటు మరిన్ని ఉన్నాయి.
1. థెఫ్ట్ డిటెక్షన్ లాక్: ఆండ్రాయిడ్ యూజర్స్ కోసం గూగుల్ ఇటీవల థెఫ్ట్ ప్రొటెక్షన్ కింద 3 కొత్త భద్రతా ఫీచర్లను తీసుకొచ్చింది. ఇవి చోరీకి గురైన సందర్భాల్లో ఫోన్ స్క్రీన్‌ను ఆటోమేటిక్‌గా లాక్ చేసేస్తాయి.
- స్మార్ట్‌లాక్ ఫీచర్: స్మార్ట్‌ఫోన్ చోరీకి గురైతే ఈ ఫీచర్ ఏఐ టెక్నాలజీతో గుర్తించి వెంటనే మొబైల్‌ను స్క్రీన్‌ను ఆటోమెటిక్‌గా లాక్ చేసేస్తుంది.
- ఆఫ్‌లైన్ డివైజ్ లాక్: పైన చెప్పిన తెఫ్ట్ లాక్ ఫీచర్ దొంగతనాన్ని గుర్తించడంలో విఫలమైతే ఆఫ్‌లైన్ డివైజ్ లాక్, రిమోట్ లాక్ ఫీచర్స్ ఉపయోగపడతాయి. చోరీ చేసిన మీ మొబైల్‌ను డిస్కనెక్ట్ చేసేందుకు దొంగలు ప్రయత్నిస్తే మీ మొబైల్ ఇంటర్నెట్ ఆఫ్ చేసి ఉన్నప్పుడు కూడా ఈ ఆఫ్‌లైన్ డివైజ్ లాక్ ఫీచర్ ఆటోమేటిక్‌గా స్క్రీన్‌ను లాక్ చేసేస్తుంది.
- రిమోట్ లాక్ ఫీచర్: ఇక రిమోట్ లాక్ ఫీచర్ చోరీకి గురైన మీ మొబైల్ ఫోన్ స్క్రీన్‌ను వేరే డివైజ్‌తో లాక్ చేసేందుకు ఉపయోగపడుతుంది. ఫోన్ చోరీకి గురైతే android.com/lock లింక్‌ను యాక్సెస్ చేయడానికి ఇది అనుమతిస్తుంది.
ఈ ఫీచర్స్ ఇప్పుడు తాజాగా తీసుకొచ్చిన ఆండ్రాయిడ్ 15 వెర్షన్‌లతో కూడిన ఆండ్రాయిడ్ ఫోన్‌లలో పని చేస్తాయని గూగుల్ తెలిపింది.
2. ప్రైవేట్ స్పేస్: గూగుల్ ప్రకారం.. ఆండ్రాయిడ్ 15లోని ఈ ప్రైవేట్ స్పేస్ ఫీచర్ సెన్సిటివ్ యాప్స్ వినియోగంలో బాగా ఉపయోగపడుతుంది. మనం ఒక్కసారి ఈ ప్రైవేట్ స్పేస్ ఫీచర్‌ను లాక్ చేస్తే ఈ యాప్స్ ఇతరులకు కన్పించవు. దీంతోపాటు యాప్ లిస్ట్, రీసెంట్ యాప్స్ వ్యూ, సెట్టింగ్స్, నోటిఫికేషన్స్ కూడా కన్పించకుండా ఉండేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.
3. టాబ్లెట్స్ అండ్ ఫోల్డబుల్స్‌కు మరింత సపోర్ట్: ఆండ్రాయిడ్ 15తో పిక్సెల్ ఫోల్డబుల్ లేదా పిక్సెల్ టాబ్లెట్ ఉన్న యూజర్స్ కస్టమైజ్డ్ లేఅవుట్ కోసం స్క్రీన్‌పై తమ టాస్క్‌బార్‌ను పిన్, అన్‌పిన్ చేయొచ్చు. దీంతోపాటు యాప్స్ పెయిర్స్ కోసం షార్ట్‌కట్స్‌ను కూడా సేవ్ చేసుకోవచ్చు. ఇది స్ప్లిట్-స్క్రీన్ సెటప్స్‌లో మల్టీ టాస్కింగ్‌ను మెరుగుపరుస్తుంది.
- యాప్స్ పెయిర్: యాప్ పెయిర్ అనేది Samsung మొబైల్ డివైజెస్‌లో ఒక ఫీచర్. ఇది మల్టీ-విండో సెషన్‌లో ఒకేసారి రెండు యాప్స్‌ను ఓపెన్ చేసేందుకు ఉపయోగపడుతుంది.
4. శాటిలైట్ కమ్యూనికేషన్: Android 15తో క్యారియర్ మెసేజింగ్ యాప్స్ మొబైల్ లేదా Wi-Fi కనెక్షన్ లేకుండా మెసెజెస్‌ను పంపించేందుకు, రిసీవ్ చేసుకునేందుకు శాటిలైట్ కనెక్టివిటీని యూజ్ చేసుకోవచ్చని గూగుల్ తెలిపింది.
ఇతర మార్పులు: నోటబుల్ ఛేంజెస్‌తో రీడిజైన్ చేసిన యూజర్ ఇంటర్ఫేస్ (UI) ఎలిమెంట్స్, పాస్‌కీలకు మెరుగైన సపోర్ట్, థర్డ్ పార్టీ యాప్స్ కోసం అడ్వాన్స్డ్ కెమెరా కంట్రోల్స్ వంటివి ఉన్నాయి.
Android 15 పనిచేసే పిక్సెల్ మొబైల్స్ ఇవే:
- Pixel 6
- Pixel 6 Pro
- Pixel 6a
- Pixel 7
- Pixel 7 Pro
- Pixel 7a
- Pixel Fold
- Pixel Tablet
- Pixel 8
- Pixel 8 Pro
- Pixel 8a
- Pixel 9
- Pixel 9 Pro
- Pixel 9 Pro XL
- Pixel 9 Pro Fold
పిక్సెల్ మొబైల్స్‌లో Android 15ని ఇన్‌స్టాల్ చేయడం ఎలా?:
- ఇందుకోసం మొదట మీరు మీ ఎలిజిబుల్ పిక్సెల్ మొబైల్లో సెట్టింగ్స్ యాప్‌కి వెళ్లి సిస్టమ్ మెనును సెలెక్ట్ చేసుకోండి.
- సిస్టమ్ మెనును కిందికి స్క్రోల్ చేసి సాఫ్ట్వేర్ అప్డేట్ను ఎంచుకోండి.
- సిస్టమ్ అప్‌డేట్‌ల ఆప్షన్‌ను ఎంచుకుని స్క్రీన్ దిగువన కుడివైపున ఉన్న చెక్ ఫర్ అప్డేట్పై ట్యాప్ చేయండి.
- మీ పిక్సెల్ మొబైల్లో ఆండ్రాయిడ్ 15 అప్‌డేట్ అందుబాటులో ఉంటే డౌన్లోడ్ అండ్ ఇన్‌స్టాల్ ఆప్షన్‌ను ప్రెస్ చేసి సూచనలను అనుసరించండి.
మార్కెట్లోకి ఇన్ఫినిక్స్ ఫస్ట్ ఫోల్డబుల్ మొబైల్- ధర ఎంతో తెలుసా?
మిడిల్ క్లాస్ కోసం జియో కొత్త యాప్- ఇకపై ఇంట్లో టీవీలు చిటికెలో కంప్యూటర్లుగా..!