OpenAI Executive Tim Brooks Resigns: చాట్‌జీపీటీ మాతృసంస్థ ఓపెన్‌ఏఐలో కీలక పదవుల్లో ఉన్న ఉద్యోగులు వరుసగా రాజీనామా చేస్తున్నారు. కంపెనీ అభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషించిన మిరా మురాటి కూడా ఇటీవలే రాజీనామా ప్రకటించగా.. తాజాగా ఎగ్జిక్యూటివ్‌గా విధులు నిర్వర్తిస్తున్న టిమ్ బ్రూక్స్ తన పదవి నుంచి వైదొలిగారు.
ఓపెన్ఏఐ నుంచి వైదొలిగిన ఆయన గూగుల్ డీప్ మైండ్‌లో చేరారు. ఈ మేరకు తన రాజీనామాకు సంబంధించిన వివరాలను టిమ్ బ్రూక్స్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. వీడియో జనరేషన్ సంబంధిత విభాగాల్లో పనిచేసేందుకే గూగుల్ డీప్‌మైండ్‌లో చేరుతున్నట్లు ఆయన తెలిపారు. గూగుల్‌లోని ప్రతిభావంతులైన ఉద్యోగులతో కలిసి పనిచేసేందుకు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు వివరించారు.
"సోరాను తీసుకురావటం కోసం ఓపెన్ఏఐలో రెండేళ్లు విధులు నిర్వహించాను. నా జీవితంలో అది అద్భుతమైన అనుభవం. నాతో ఇంతకాలం కలిసి పనిచేసిన వారందరికీ ధన్యవాదాలు." అంటూ టిమ్ సమాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా తెలిపారు. డీప్‌మైండ్ సీఈఓ డెమిస్ హస్సాబిస్ టిమ్ బ్రూక్స్‌ను తమ సంస్థలోకి స్వాగతించారు.
I will be joining @GoogleDeepMind to work on video generation and world simulators! Can't wait to collaborate with such a talented team.
— Tim Brooks (@_tim_brooks) October 3, 2024
I had an amazing two years at OpenAI making Sora. Thank you to all the passionate and kind people I worked with. Excited for the next chapter!
సోరాను తీసుకురావడంలో టిమ్ పాత్ర: ఏఐ ఆధారిత టెక్స్ట్-టు-వీడియో జనరేటర్ మోడల్ సోరాను తీసుకురావడంలో టిమ్ బ్రూక్స్ ముఖ్య పాత్ర పోషించారు. వీడియో మోడల్స్‌ను తీసుకొచ్చే టీమ్‌కు ఆయన నాయకత్వం వహించారు. గతేడాది ఫిబ్రవరి నెలలోనే ఈ సోరా అందుబాటులోకి వచ్చింది.
యూజర్ ఇచ్చిన ప్రాంప్ట్ ఆధారంగా హై డీటెయిల్స్ కలిగిన ఒక నిమిషం నిడివి కలిగిన వీడియోను సోరా క్రియేట్ చేయగలదు. అయితే దీని వినియోగంలో అనేక సాంకేతికత సమస్యలు ఎదురయ్యాయి. 60 సెకన్ల వీడియోను రూపొందించేందుకు దీనికి ఏకంగా 10 నిమిషాలు సమయం పట్టేది. ఈ సమస్యను పరిష్కరించేందుకు కంపెనీ చర్యలు చేపడుతున్న సమయంలో టిమ్ బ్రూక్స్ వైదొలగడం గమనార్హం.
ఓపెన్ఏఐ నుంచి కీలక ఉద్యోగుల రాజీనామాలు: కాగా ఓపెన్ఏఐలో కీలకమైన పదవుల్లో ఉన్నవారందరూ వరుసగా రాజీనామా చేస్తున్నారు. ఇటీవలే ఆ సంస్థ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మిరా మురాటి తన పదవికి రాజీనామా ప్రకటించారు. తన వ్యక్తిగత లక్ష్యాల కారణంగా వైదొలగుతున్నట్లు పేర్కొనగా.. తాజాగా ఎగ్జిక్యూటివ్ పదవికి టిమ్ బ్రూక్స్ రాజీనామా చేసి గూగుల్ డీప్ మైండ్‌లో చేరారు.
సొంత AI ప్లాట్‌ఫారమ్‌ను లాంచ్ చేసిన ఇన్ఫినిక్స్- గూగుల్, శాంసంగ్‌కు పోటీగా అదిరే ఫీచర్స్..!