A Young Woman Suicide in Bellampalli : ఆ యువకుడు ఓ ప్రముఖ పార్టీ విద్యార్థి విభాగం లీడర్. ప్రేమ పేరుతో సాయి స్నేహిత అనే యువతికి దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకుందాం అనే సరికి కులాల ప్రస్తావన తెచ్చి అందుకు విముఖత చూపాడు. దీంతో మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్యకు పాల్పడింది. మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి వన్ టౌన్ పోలీసుల కథనం ప్రకారం, బెల్లంపల్లి పట్టణంలోని హనుమాన్ బస్తీకి చెందిన జంగపల్లి సాయి స్నేహిత (21), పట్టణంలోని మహ్మద్ ఖాసీం బస్తీకి చెందిన బీఆర్ఎస్వీ (భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం) నియోజకవర్గ అధ్యక్షుడు ఈదునూరి శ్రీనాథ్ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.
కొంతకాలంగా యువతి పెళ్లి చేసుకోవాలని కోరుతుండగా ఇరువురి కుల ప్రస్తావన తీసుకొస్తూ యువకుడు శ్రీనాథ్ నిరాకరిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం (డిసెంబర్ 02) సాయంత్రం యువతి ఫోన్‌లో శ్రీనాథ్‌తో సుదీర్ఘంగా మాట్లాడింది. దీనిలో ఎక్కవగా పెళ్లి ప్రస్తావన గురించే సంభాషణ జరిగినట్లు తెలుస్తోంది. అనంతరం యువతి ఇంట్లోని ఓ గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. ఇది చూసిన ఇంట్లోనే ఉన్న తన సోదరి తలుపు తట్టినా ఎంత సేపటికీ తీయలేదు. ఇంతలో శ్రీనాథ్ అక్కడికి చేరుకున్నాడు. ఇద్దరూ కలిసి బలవంతంగా తలుపులు ఎలాగోలా తెరిచారు.
కొన ఊపిరితో ఉండగానే జంప్ : అప్పటికే సాయిస్నేహిత చున్నీతో ఉరేసుకొని ఉండటంతో ఆమెను కిందికి దించారు. యువతి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నట్టు గుర్తించిన శ్రీనాథ్, అక్కడి నుంచి వెంటనే పరారయ్యాడు. కుటుంబసభ్యులు బాధితురాలిని హుటాహుటిన తొలుత బెల్లంపల్లిలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మంచిర్యాల జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు.
అక్కడ చికిత్స పొందుతూ సోమవారం (డిసెంబర్ 02)న అర్ధరాత్రి యువతి మృతి చెందింది. బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ నర్సయ్య తెలిపారు. ఈదునూరి శ్రీనాథ్‌పై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అధిష్ఠానం నిర్ణయం మేరకు ఆయనను బీఆర్ఎస్వీ నియోజకవర్గ అధ్యక్షుడి పదవి నుంచి తొలగించినట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ తెలిపారు.
"అద్దె కడతారా? - పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకోమంటారా?"
ఆ యువకుడి వేధింపుల వల్లే నా చిట్టితల్లి ఆత్మహత్య చేసుకుంది - భువనగిరిలో యువతి మృతిపై తండ్రి ఫిర్యాదు