Passport Re Issue Process : మీ పాస్‌పోర్ట్ చిరిగిందా? లేదా పోగొట్టుకున్నారా? అయితే వెంటనే రీఇష్యూ కోసం అర్జీ చేసుకోండి. డ్యామేజీ పాస్‌పోర్ట్‌ను ఇన్‌వ్యాలీడ్‌గా పరిగణిస్తారు. విదేశీ ప్రయాణాలను నిలిపివేసే అవకాశముంది. ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం పరిధిలో 5 సేవా కేంద్రాలు, 14 పోస్టాఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు ఉన్నాయి. రోజూ 4,000ల అపాయింట్‌మెంట్లు జారీ అవుతున్నాయి. ఇందులో సుమారు 10 శాతం దరఖాస్తుల్లో చిరిగిపోయినవి లేదా పోగొట్టుకున్నవి ఉంటున్నాయి.
కొందరు పాస్‌పోర్ట్ రీఇష్యూ కోసం తత్కాల్లో బుక్ చేస్తున్నారు. ఆ తర్వాత అధికారుల సూచనతో సాధారణ విధానానికి మార్చుకుని ప్రక్రియ పూర్తి చేసేసరికి సమయం వృథా అవుతోంది. చిన్న చిరుగు పడినా పాస్‌పోర్ట్‌ను డ్యామేజీగానే పరిగణించే అవకాశం ఉంది. వీటికి వెంటనే డూప్లికేట్ జారీ చేసే అవకాశం లేదు. పాస్‌పోర్ట్ లాస్, డ్యామేజీ ఆప్షన్ కింద రీ-ఇష్యూకు అర్జీ చేసుకోవాలి. అనంతరం కొత్తదానికి మరో నంబర్ కేటాయించి ఆ తేదీ నుంచి పాస్‌పోర్ట్ గడువు నిర్ణయిస్తారని చెబుతున్నారు.
విదేశాల్లో పోతే ఎలా? : గతంలో ఓ యూట్యూబర్‌కు విదేశాల్లో ఇలాంటి అనుభవం ఎదురైంది. పాస్‌పోర్ట్ కాపీ దగ్గరే ఉండడంతో అతను స్థానికంగా ఉండే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ కాపీతో ఇండియన్ ఎంబసీకి వెళ్లి ఆన్‌లైన్ లేదా రాతపూర్వకంగా పాస్‌పోర్ట్ పోగొట్టుకున్న సమాచారాన్ని అందించారు. అత్యవసరం అని చెప్పడంతో సంబంధిత పత్రాలు సమర్పించిన తర్వాత కొంత రుసుము తీసుకుని వెరిఫికేషన్ పూర్తి చేసి నాలుగైదు రోజుల్లో కొత్తది పంపుతారు. వీసా కోసం మరోసారి అర్జీ చేసుకోవాలి. పాస్‌పోర్ట్, వీసా, ట్రావెల్ ఇన్సూరెన్స్ జిరాక్స్‌లు లేదా ఫోన్‌లో పీడీఎఫ్ కాపీలు పెట్టుకోవడంతో ఇబ్బందులు ఉండవని అధికారులు అంటున్నారు.
సంఘటనలు ఇవి : మల్కాజిగిరికి చెందిన అజయ్ పాస్‌పోర్ట్ తీసుకుందామని అర్జీ చేసుకున్నారు. అపాయింట్‌మెంట్ ఇచ్చిన రోజు పాస్‌పోర్ట్ సేవా కేంద్రానికి వెళ్లగా సిబ్బంది మీ వివరాలతో ముందే పాస్‌పోర్ట్ ఉంది కదాని అడిగారు. అవాక్కైన అజయ్ ఇంట్లో వారిని ప్రశ్నించగా అతని తండ్రి 20 ఏళ్ల కిందటే దీనిని తీసుకున్నట్లు చెప్పారు. అది కనిపించకపోవడంతో అతను అధికారులను సంప్రదించగా ఎఫ్‌ఐఆర్ తీసుకురావాలని అన్నారు.
వెంటనే అజయ్ పాస్‌పోర్ట్ పోయిందని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, అక్కడి పోలీసులు కమిషనరేట్‌లో అర్జీ చేసుకోవాలని చెప్పారు. దీంతో అతను కమిషనరేట్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అనంతరం మీసేవాలో రీఇష్యూకి దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలోనే స్థానిక పోలీసులు ధ్రువీకరించిన తర్వాత ఎఫ్‌ఐఆర్ అందజేశారు. దానిని పాస్‌పోర్ట్ సేవాకేంద్రంలో సమర్పించడంతో కొత్తది వచ్చింది. దీనికి 20 రోజుల సమయం పట్టింది.
అర్జెంట్‌గా విదేశాలకు వెళ్లాలా? 'తత్కాల్ పాస్‌పోర్ట్' కోసం అప్లై చేసుకోండిలా!